♦ కులవృత్తుల ఆధునీకరణకు సర్కారు ప్రణాళికలు
♦ బీసీ సమాఖ్యలకు 70, 80 శాతం రాయితీతో రుణాలు
♦ వడ్డెర్లకు పొక్లెయిన్లు.. నాయి బ్రాహ్మణులకు బ్యూటిషియన్ కిట్
♦ రజకులకు దోబీఘాట్లు, ఇతర సదుపాయాలు
సాక్షి, హైదరాబాద్: బీసీ ఫెడరేషన్లకు జవసత్వాలు కల్పించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఫెడరేషన్లలోని ఆయా కులవృత్తులను ఆధునీకీకరించే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మారుతున్న కాల, పరిస్థితులకు అనుగుణంగా కులవృత్తుల ద్వారా అందించే సేవలను ఆధునీకీకరించే చర్యలు చేపట్టనున్నారు. తద్వారా ఆయా వృత్తులవారు తగిన పారితోషకం, లబ్ధి పొందేలా మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ ఫెడరేషన్లలోని ఒక్కో సభ్యుడికి రూ.లక్ష లేదా రెండు లక్షల చొప్పున (15 సభ్యులున్న గ్రూపునకు) రూ.15 లక్షలు లేదా రూ.30 లక్షలను 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, నూతన రాయితీ విధానంలో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 2015-16 నుంచి రూ.లక్ష-10 లక్షల మధ్య 80-60 శాతం సబ్సిడీలతో రుణాలు ఇస్తున్నారు. అయితే ఫెడరేషన్లకు మాత్రం ఇంకా 50 శాతం సబ్సిడీతోనే రుణాలు ఇస్తున్నారు. కానీ వీటి ద్వారా ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. దాంతో వీటిని కూడా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఫెడరేషన్లకు ఇస్తున్న రుణాలకు రూ.లక్షకు 80 శాతం, రూ. రెండు లక్షలకు 70 శాతం సబ్సిడీ ఇచ్చేలా ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలను సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర), వాల్మీకి/బోయ, కృష్ణబలిజ-పూసల, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి/శాలివాహన, మేదర, కల్లు గీతకారులకు ఫెడరేషన్లు ఉన్నాయి. కొత్తగా 2016-17 ఏడాదిలో సంచారజాతుల సంక్షేమం కోసం రూ. ఐదు కోట్ల రూపాయలతో సంచారజాతుల సమాఖ్య లిమిటెడ్‌ను కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వడ్డెర్లకు పొక్లెయిన్లు..
వడ్డెర్లు అనేక ప్రయాసలకు ఓర్చి కఠినతరమైన వృత్తిని నిర్వహిస్తుండడంతో వారి గ్రూపులకు పొక్లెయిన్లు వంటి వాటిని రుణాల ద్వారా అందజేయాలని నూతన ప్రణాళికలో భాగంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రజకవృత్తి ఆధునీకీకరణలో భాగంగా దోబీఘాట్ల నిర్మాణానికి బోరుబావి తవ్వకం, విద్యుత్ కనెక్షన్‌తో మోటారు అమరిక , నీటితొట్టి, షెడ్లనిర్మాణం, విశ్రాంతి గది, మరుగుదొడ్ల నిర్మాణం, డ్రైక్లీనింగ్ సామగ్రి వంటి వాటిని అందించనున్నారు. అలాగే నాయీ బ్రాహ్మణులకోసం మొబైల్ బ్యూటీషియన్‌కు అవసరమైన హంగులు సమకూర్చనున్నారు. వినియోగదారుల ఇంటివద్దనే సేవలు అందించేందుకు కావాల్సిన శిక్షణనిచ్చి ఒక ద్విచక్రవాహనం, బ్యూటీషియన్ కిట్, యాప్రాన్, ఫోన్ సమకూర్చి, వినియోగదారులు సంప్రదించేందుకు వీలుగా ఒక యాప్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తాన్ని భరించేందుకు ఎస్ బ్యాంక్ సుముఖత వ్యక్తంచేసింది. ఇదే తరహాలో ఇతర వృత్తులను కూడా ఆధునీకీకరించి, ఆయా కులవృత్తుల వారు ఆర్థికాభివృద్ధిని సాధించేలా బీసీ శాఖ ప్రణాళికలకు తుదిరూపునిస్తోంది.
బీసీ ఫెడరేషన్లకు జవసత్వాలు!
Published Mon, Apr 4 2016 4:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement