- ప్రారంభించిన జంట కమిషనరేట్ల అధికారులు
- రహదారులతో పాటు లో-క్లాస్ లాడ్జిలపై దృష్టి
- ఏజెంట్ల’ వివరాలూ ఆరా తీయాలని నిర్ణయం
- రౌడీషీటర్లపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు
హైదరాబాద్
గ్రేటర్ ఎన్నికలతో పాటు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు తనిఖీల విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రాత్రివేళల్లో మాత్రమే జరిగే సోదాలకు ఇకపై పగటి పూట చేయాలని నిర్ణయించారు.
సాధారణంగా పొరుగు జిల్లాల నుంచి ఎన్నికల కోసం వచ్చే వాళ్లు లాడ్జిల్లోనే మకాం వేస్తారని.. ఖరీదైన హోటళ్లకు బదులు.. లోక్లాస్ లాడ్జీల్లో బసచేస్తారని పోలీసులు తెలిపారు. అందువల్ల ఈ టైపులాడ్జీలపై అధికారులు దృష్టి పెట్టారు. ఓ నిర్ధిష్ట సమయం అంటూ లేకుండా తరచు సమయాలు, ప్రాంతాలు మార్చి ఆకస్మిక తనిఖీలు చే యాలని అధికారులు నిర్ణయించారు.
రాజధాని నగరానికి అనునిత్యం పొరుగు జిల్లాల నుంచి విద్యా, వైద్య, వ్యాపార పనులతో పాటు విహారం కోసం వచ్చే వీరిలో అనేక మంది సైతం లాడ్జిలనే ఆశ్రయిస్తుంటారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు తమ తనిఖీల వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
సోదాల నేపథ్యంలో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలంటూ ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, వృద్ధులతో పాటు కుటుంబ సమేతంగా, పిల్లలతో ఉండే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్ల వివరాలూ ఆరా... ధన, బల ప్రయోగం చేయడంతో పాటు ఓటర్లను ప్రభావితం చేయగలిగే వాళ్లను పోలింగ్ ఏజెంట్ల రూపంలో వినియోగించుకోవడానికి’ కొందరు అభ్యర్థులు పథకం వేస్తున్నారని పోలీసుల అనుమానిస్తున్నారు.
మరో వైపు.. నేరచరితులు ఎలక్షన్ ఏజెంట్లుగా లేకుండా చూసేందుకు.. పోలింగ్ ఏజెంట్ల పైనా డేగకన్ను వేయనున్నారు. ప్రతి ఏజెంట్ వివరాలు ఆరా తీయాలని నిర్ణయించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకమైన రౌడీషీటర్లు పీడీ యాక్ట్ కింద జైల్లోనే ఉన్నారు. అయినప్పటికీ టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ పోలీసులు వారితో పాటు వారి అనుచరుల కదలికలపై నిఘా వేసి ఉంచారు. ఓ పక్క బైండోవర్ కాని వారి కోసం గాలిస్తూన్నారు. దీని కోసం ప్రత్యేకంగా షాడో పార్టీలు రంగంలోకి దిగాయి.