అన్నలు కాదు.. అసురులు!
♦ అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్న చెల్లెలు
♦ మద్యానికి డబ్బు ఇవ్వడంలేదని నిత్యం కొడుతున్న సోదరులు
♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఎర్రగడ్డ: మద్యానికి బానిసైన అన్నదమ్ములు ఇంట్లో వారిని నరకయాతనకు గురిచేస్తున్నారు... కుటుంబాన్ని పోషించాల్సిన అన్నలు జులాయిగా తిరుగుతుండటంతో విధిలేక వారి చెల్లెలే ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. తాగడానికి డబ్బు కోసం అన్నలు చిత్రహింసలకు గురి చేస్తుండటంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం... ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్, పుష్ప దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పదేళ్ల క్రితం రాజ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన కుమారులు మహేష్, సురేష్ మద్యానికి, గంజాయికి బానిసలయ్యారు. నిత్యం ఇంటికి తాగి వచ్చి తల్లి పుష్ప, చెల్లెలు స్వాతిని మానసికంగా వేధించడమే కాకుండా వారిపై దాడి చేస్తున్నారు. తల్లికి టీబీ వ్యాధి సోకి మంచానికి పరిమితం కావడంతో ఇంటి బాధ్యతలను తనపై వేసుకుంది స్వాతి. ఇళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
తనకు వచ్చే డబ్బుతో తల్లికి మందులు కొనడంతో పాటు తన అన్నల జేబు ఖర్చులకు కూడా డబ్బు ఇస్తోంది. వాటితో సరిపెట్టుకోకుండా మద్యానికి డబ్బు ఇవ్వలేదని నిత్యం స్వాతిని వారు ఇంటి తెలుపులు వేసి మరీ గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. నిత్యం స్వాతికి రాత్రైందంటే న రకమే. ప్రతినెలా తల్లికి వచ్చే ఆసరా ఫించన్‌ను మహేష్,సురేష్‌లు లాక్కొని తమ జేబులో వేసుకుంటున్నారు. తల్లికి మానవత్వంతో ఇరుగుపొరుగు వారు ఇచ్చే పండ్లు, ఆహారాన్ని కూడా ఈ సోదరులే మింగేస్తున్నారని పలువురు తెలిపారు. స్థానికులు మహమద్ మోసిన్, గుమ్మడిదల సుధాకర్, సల్మాన్‌రాజ్, నర్సింహ్మలు స్వాతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు స్వాతి తన అన్నల బాధను భరించలేక సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.