
దొంగను పట్టించిన ఆన్‌లైన్ ప్రకటన
మలేషియా టౌన్‌షిప్: ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా సెల్‌ఫోన్ కొనడానికి వచ్చిన ఓ వ్యక్తి దొంగిలించిన బైకును వారి వద్ద ఉంచి ఫోన్‌తో ఉడాయించాడు. కొన్ని రోజుల తర్వాత అదే తరహాలో మోసం చేయడానికి వచ్చి అదే వ్యక్తులకు చిక్కాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి... గోకుల్ ప్లాట్స్‌కు చెందిన సోము, చందు తమ వద్ద స్మార్ట్ ఫోన్ అమ్మకానికి ఉన్నట్టు ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లో పెట్టారు. ఈ ప్రకటన చూసిన దీపక్ అనే వ్యక్తి ఈనెల 6న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి సోము, చందు వద్దకు వచ్చాడు. ‘ఈ ఫోన్ మా అక్క కోసం తీసుకుంటాను. ఆమెకు చూపించి నచ్చితే కొంటాను’ అని చెప్పాడు. అందుకు బదులుగా తన బైకు ఉంచి ఫోన్ తీసుకెళ్లాడు. రోజులు గడిచినా తిరిగి రాలేదు.
తాము మోసపోయిన విషయాన్ని వారు గ్రహించారు. మరో ఫోన్ అమ్మకానికి ఉన్నట్టు సృష్టించి వైబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన దీపక్ మంగళవారం మళ్లీ వారి వద్దకు వచ్చాడు. సోము, చందు అతణ్ణి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని జేబులను తనిఖీ చేయగా వివిధ రకాల పేర్లతో ద్విచక్ర వాహనాల నకిలీ ఆర్సీ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులతోపాటు బైక్‌లకు చెందిన మారు తాళాలు, పదుల సంఖ్యలో సిమ్ కార్డులు లభించాయి. దీపక్‌ను అదుపులోకి తీసుకున్న మియాపూర్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠాలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలిసింది.