సాక్షి, హైదరాబాద్: పులులకు సమృద్ధిగా ఆహారం సమకూర్చటంతోపాటు అటవీ ఆవరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు వీలైనంత త్వరగా వెయ్యి జింకలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని మృగవని జింకల పార్కుతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు కృష్ణా తీర ప్రాంతం నుంచి జింకలను తరలించాలని నిర్ణయించారు.
‘కవ్వాల్ పులికి ఫుడ్డు సవ్వాల్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఫారెస్టు అధికారులు స్పందించారు. అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా, వన్యప్రాణి సంరక్షణ ప్రధాన అధికారి మనోరంజన్ భాంజా, ప్రత్యేక అధికారి శంకరన్‌లు సమావేశమయ్యారు. ఈ నెలలోనే పులుల గణన ఉన్న నేపథ్యంలో విధివిధానాలతోపాటు ‘సాక్షి’ కథనంపై చర్చించారు. కవ్వాల్‌లో పులి ఆవాసాల్లో శాకాహార జంతువులు ఉండాల్సిన నిష్పత్తిలో లేవని అంచనాకు వచ్చారు.
మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి కవ్వాల్‌కు వస్తున్న పులులు.. ఆహారం లేకనే తిరిగి వెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా మృగవని జింకల పార్కుల్లో ఎక్కువ సంఖ్యలో జింకలు ఉన్నాయని, వాటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా తీరంలో జింకలు పంటచేలపై దాడి చేస్తున్న ఘటనలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ జింకలను కవ్వాల్‌కు తరలించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పీకే ఝా ‘సాక్షి’తో మాట్లాడారు.
జింకల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వాటిని తీసుకెళ్లి కవ్వాల్ టైగర్ షెల్టర్ జోన్‌లో వదిలేస్తామని చెప్పారు. అటవీ మధ్యలో నివాస గ్రామాల వల్ల కూడా పులులు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ నివాస గ్రామాల తరలింపుపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతి ఆదివాసీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 17 తర్వాత ఆదివాసీ గ్రామాల తరలింపునకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
ఈ నెల 22 నుంచి పులుల గణన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు.
ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment