మళ్లీ స్నాచర్ల పంజా!
మూడు రోజుల్లో ఏడు ఉదంతాలు నమోదు
గురువారం నార్త్‌జోన్‌లో రెండు స్నాచింగ్స్
సీసీ కెమెరాల్లో ‘చిక్కిన’ రెండు ముఠాలు
బవరియా గ్యాంగ్ పైనే అనుమానాలు
సిటీబ్యూరో/అడ్డగుట్ట/రామ్‌గోపాల్‌పేట: నగరంలో చైన్‌స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. జంట కమిషనరేట్లలో మూడు రోజుల వ్యవధిలో ఏడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఆరింటికి రెండు ముఠాలే బాధ్యులుగా గుర్తించారు. సీసీ కెమెరాల్లో చిక్కిన నిందితులు, వాహనాల నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అధికారులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బవరియా గ్యాంగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నార్త్‌జోన్‌లో ఇద్దరే...
రెండు రోజుల వ్యవధిలో నార్త్‌జోన్‌లో నాలుగు స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి గోపాలపురం, తుకారాంగేట్ ఠాణాల పరిధిలో, గురువారం వేకువజామున మహంకాళి, తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో చోరులు పంజా విసిరారు. సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన అధికారులు ఈ నాలుగూ ఒకే ముఠా పనిగా గుర్తించారు. ఎరుపు, నలుపు రంగులతో కూడిన పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు ఈ పని చేసినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తూ పల్సర్ వాహ నాలపై దృష్టి పెట్టారు.
ఆరెండూ మరో ముఠా పని...
హైదరాబాద్-సైబరాబాద్ కమిషనరేట్లలోని ఫలక్‌నుమా, నాచారం, సరూర్‌నగర్ ఠాణాల పరిధుల్లో మంగళ-బుధవారాల్లో మూడు స్నాచింగ్స్ జరిగాయి. సరూర్‌నగర్‌లోని కర్మన్‌ఘాట్ మినహా మిగిలిన రెండు ఉదంతాలకూ పాల్పడింది ఒకే గ్యాంగ్‌గా ప్రాథమికంగా నిర్థారించారు. ఇక్కడ కూడా నిందితులు పల్సర్ వాహనాన్నే వాడినప్పటికీ పూర్తి ఎర్రరంగుది వినియోగించారు. ఫలక్‌నుమ ప్రాంతంలో ఏకంగా టిఫిన్ సెంటర్‌లోకే వచ్చిన చోరులు గొలుసు తస్కరించిన విషయం విదితమే.
మన్‌ప్రీత్ పైనే అనుమానాలు...
ఈ స్నాచింగ్స్‌కు సంబంధించి బవరియా గ్యాంగ్ సూత్రధారి మన్‌ప్రీత్ పైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఉన్న 12 గ్రామాలకు చెందిన అనేక మంది దేశ వ్యాప్తంగా స్నాచింగ్స్ చేయడాన్నే వృృత్తిగా ఎంచుకున్నారు. పోలీసు పరిభాషలో వీటిని బవరియా గ్యాంగ్స్‌గా పరిగణిస్తారు. ఆ జిల్లాలోని బడా కాన్పూర్ గ్రామానికి చెందిన మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ అనేక స్నాచింగ్ గ్యాంగ్‌ను నిర్వహిస్తున్నాడు. ఆ ముఠాలో సభ్యుడిగా ఉన్న గోవింద్‌ను రాజేంద్రనగర్ పోలీసులు మార్చి తొలివారంలో అరెస్టు చేశారు. దీంతో తప్పించుకుని పారిపోయిన మంగళ్ తదితరులు పది రోజుల్లోనే మళ్లీ సిటీని టార్గెట్ చేశారు. షామ్లీ జిల్లాలోని అహ్మద్‌ఘడ్, బడా కాన్పూర్ కాలా, నయాబస్ గ్రామాలకు చెందిన సోను కుమార్, రాజీవ్ ఖోహ్లీ, పింకు కుమార్‌లతో ముఠా కట్టిన మంగళ్ మార్చి రెండో వారంలో సిటీకి చేరుకున్నాడు. ఆ నెల 13, 14, 15 తేదీల్లో జంట కమిషనరేట్ల పరిధిలోని సైదాబాద్, చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మీర్‌పేట్ తదితర ఠాణాల పరిధిలో 12 స్నాచింగ్స్ చేశారు. వీటితో పాటు మరో రెండు చోట్ల స్నాచింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసులకు సంబంధించి సోను చిక్కాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మన్‌ప్రీత్ మరోసారి ముఠాలతో వల విసురుతున్నాడని అనుమానిస్తున్నారు.
పని చేయని పోలీసు చర్యలు...
చైన్ స్నాచర్లు కనిపిస్తే చాలు చేతికి చిక్కాల్సిందేనంటూ సైబరాబాద్ పోలీసు ఏర్పాటు చేసిన ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ (సీసీ టీమ్స్) పత్తా లేకుండా పోయాయి. 110 మంది సిబ్బందితో 55 బృందాలు గత ఏడాది నవంబర్‌లో ఏర్పాటు చేశారు. చైన్‌స్నాచర్లు కనిపించినప్పుడు వారిని పట్టుకునే విధానంలో మెళకువలూ నేర్పారు. వనస్థలిపురం ఠాణా పరిధిలో చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన స్నాచర్లపై కాల్పులు జరపడం మినహా... ఈ ృృందాలు సాధించిన విజయాలు అంటూ ఏమీ లేవు. హైదరాబాద్ కమిషనరేట్‌లో పీడీ యాక్ట్, దోపిడీ సెక్షన్లతో కేసు నమోదు వంటి చర్యలు తీసుకున్నా... స్నాచర్లను పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నాయి. క్రైమ్ టీమ్స్ కొరగాకుండా పోవడంతో నేరగాళ్లు విృృంభిస్తున్నారు.
ఇవీ ఉదంతాలు
మంగళవారం: ఫలక్‌నుమ శంషీర్‌గంజ్‌లో రెడ్డి టిఫిన్ సెంటర్‌కు మంగళవారం ఉదయం 7.30 గంటల వచ్చిన ఇద్దరు యువకులు టిఫిన్ అనంతరం నిర్వాహకురాలు టి.లక్ష్మీ(35) మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచుకుపోయారు.
బుధవారం: నాచారం పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీకి చెందిన కరుణశ్రీ బుధవారం ఉదయం నడుచుకుంటూ వెళ్తుండగా పల్సర్‌పై వచ్చిన ఇరువురు ఆమె మెడలోంచి 8 గ్రామలు బంగారు పుస్తెలతాడు స్నాచింగ్ చేశారు.
సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని కర్మన్‌ఘాట్ మాధవనగర్‌కు చెందిన హరిత(40) బుధవారం సాయంత్రం దుకాణనికి వెళ్లి వస్తుండగా... ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుపోయారు.తుకారాంగేట్ పరిధిలోని అడ్డగుట్ట ఈస్ట్‌మారేడుపల్లికి చెందిన వేదవల్లి (59) రాత్రి 7.30 గంటలకు నవీన్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లివస్తుండగా స్నాచర్లు ఐదున్నర తులాల మంగళసూత్రం, గొలుసు లాక్కుపోయారు. గోపాలపురం ఠాణా పరిధిలోని న్యూ బోయిగూడకు చెందిన సుజాత (57) రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్లి వస్తుండగా పంజా విసిరిన స్నాచర్లు ఆమె మెడలోని చైన్ స్నాచింగ్ చేశారు.
గురువారం: తుకారాంగేట్ ఠాణా పరిధిలోని అడ్డగుట్టకు చెందిన లక్ష్మి (40) బస్టాండ్ పక్కనే కిరాణ దుకాణ ం నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇద్దరు యువకులు పల్సర్ వాహనంపై ఈమె దుకాణానికి వచ్చారు. వస్తువు కొనుగోలు చేస్తున్నట్లు చేసి ఆమె మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెల్లారు. తన గొలుసు రోల్డ్‌గోల్డ్ అని, 3 గ్రాముల బంగారు పుస్తెలు దానికి ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహంకాళి ఠాణా పరిధిలోని రాణిగంజ్ గాస్మండికి చెందిన శ్రీనివాస్‌యాదవ్ సతీమణి చంద్రకళ (48) గురువారం ఉదయం 6.30గంటల సమయంలో పక్కనే ఉన్న చెత్త కుండీలో చెత్త వేసేందుకు భయటకు వచ్చారు. చెత్తవేసి వస్తుండగా పల్సర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. చెత్త వేసేందుకు వెళుతున్న ఆమెను వెంబడించిన దుండగులు తిరిగి వస్తుండగా మళ్లీ వాహనం తిప్పుకున్నారు. వెనుక కూర్చున్న ఒకడు వాహనం దిగి ఆమె మెడలోని చైన్ లాక్కుని వాహనం ఎక్కి పరారయ్యారు. నిందితులను వెంబడించేందుకు కొంత మంది యత్నించినా క్షణాల్లో స్నాచర్లు అక్కడి నుంచి ఉడాయించారు.