
‘టిమ్స్’తో ట్రిప్పుల లెక్కలు
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తోంది.
► సర్వేకు గ్రేటర్ ఆర్టీసీ సన్నద్ధం
► ప్రతి రూట్‌లో ప్రయాణికుల రద్దీపై శాస్త్రీయమైన అంచనాలు
► నష్టాల నుంచి గట్టెక్కేందుకు మరో కసరత్తు
సాక్షి,సిటీబ్యూరో: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తోంది. ఎండలు మండుతున్నా.. ఆదరణ లేక నష్టాల్లో నడుస్తున్న ఏసీ బస్సులపై ఇటీవల వివిధ రూటుల్లో సర్వే నిర్వహించినట్టే.. టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల (టిమ్స్) ఆధారంగా మరో సర్వేకు సన్నద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 1050కి పైగా రూటు ల్లో 42 వేల ట్రిప్పులపై శాస్త్రీయమైన సర్వే జరపాలని నిర్ణయించింది. తద్వారా ఏ రూట్‌లో, ఏ ట్రిప్పులో, ఏ సమయంలో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువ ఉంది? ఏ ట్రిప్పులో తక్కువ ఉందనే అంచనాల ఆధారంగా బస్సు లు నడుపుతారు.
తద్వారా బస్సుల నిర్వహణకు అయ్యే ఇంధనం, ఇతర ఖర్చులను ఆదా చేయడమే కాకుండా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపి ఆదా యం పెంచుకునేందుకు ఈ సర్వే దోహదం చేస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 3850 బస్సులు ప్రతి రోజు 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం అందిస్తున్నాయి. అయినప్పటికీ రోజుకు రూ.96 లక్షల చొప్పున నష్టాలు వస్తున్నాయి. ఈ ఏడాది సుమారు రూ.289 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఒకవైపు భారీ సంఖ్యలో ప్రయాణికులకు సేవలందజేస్తూ అతి పెద్ద ప్రజా రవాణా సంస్థగా కొనసాగుతున్నా... కనీసం లాభనష్టాలు లేని పరిస్థితుల్లో కూడా బస్సులు తిప్పలేని పరిస్థితి నెలకొనడంతో గ్రేటర్ ఆర్టీసీ ఈ కసరత్తు చేపట్టింది.
5200 టిమ్స్ యంత్రాల క్రోడీకరణ...
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోల్లో వినియోగిస్తున్న 5200 టిమ్స్ యంత్రాల్లో ప్రతి రోజు నిక్షిప్తమ య్యే సమాచారం ఆధారంగా ఈ అంచనాలను రూపొం దిస్తారు. ప్రతీ డిపో నుంచి బయలుదేరే బస్సులు, ట్రిప్పులు, రూట్లు, ప్రయాణికుల సంఖ్యను నిర్ధారిస్తా రు. ఆతర్వాత ప్రతి రెండు డిపోల మధ్య రూట్లు, ట్రిప్పు లు, ప్రయాణికులను అంచనా వేస్తూ ఏ ట్రిప్పులో, ఏ బస్టాపు నుంచి ఎంతమంది ప్రయాణికులు బయలుదేరుతున్నారు. ఆ సమయంలో ఎన్ని బస్సులు ఆ మార్గం లో వెళ్తున్నాయనేది తేలుస్తారు.
ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ట్రిప్పుల సంఖ్య తగ్గించడం..., ఎక్కువగా ఉంటే పెంచడం వంటివి చేస్తారు. ఫలితంగా ప్రయాణికుల అవసరాల మేరకు శాస్త్రీయ పద్ధతిలో బస్సులు నడపడం సాధ్యవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. దీనివల్ల అనవసర ఖర్చు లు తగ్గి, ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడతున్నారు.
సాఫ్ట్‌వేర్ సంస్థల సహాయం...
ఇప్పటి వరకు ఎక్కడా ఇలా ప్రతి ప్రయాణికుడిని గుర్తించే విధంగా సమగ్రమైన శాస్త్రీయమైన సర్వేలు జరగలేదు. అంచనాలనూ రూపొందించలేదు. గ్రేటర్ ఆర్టీసీలో తలపెట్టిన ఈ సర్వే కోసం సాఫ్ట్‌వేర్ సంస్థల సహాయం తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రతిభావంతులైన నిపుణుల ద్వారా ఈ సర్వే నిర్వహిస్తే కచ్చితమైన అంచనాలు రాగలవంటున్నారు. ఈ క్రమంలో టిమ్ యంత్రాలతో పాటు, అవసరమైతే ప్రత్యేక డివైజ్‌లను ఏర్పాటు చేసి బస్సులోకి ఎక్కేవారిని, దిగేవారిని లెక్కించే పద్ధతిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.