
'దాసరి కోలుకుంటున్నారు'
పరామర్శించిన చంద్రబాబు, చిరు
హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆసు పత్రిలో చేరిన దర్శకనిర్మాత, మాజీ కేంద్రం మంత్రి దాసరి నారాయణరావును ఏపీ సీఎం చంద్ర బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయనతో పాటు రాజ్య సభ సభ్యులు చిరంజీవి, టి.సుబ్బ రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంత రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, జయప్రద, అశ్వనీదత్, వీవీ వినాయక్, సి.కల్యాణ్, విజయబాపినీడు తదితరులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని పరా మర్శించారు. నటుడు, నిర్మాత మోహన్‌బాబు ఉదయం నుంచీ ఆసుపత్రి వద్దే ఉన్నారు.
కిడ్నీ పనితీరు మెరుగుపడింది: వైద్యులు
దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని, ఆయన కిడ్నీ పనితీరు మెరుగుపడిందని, డయాలసిస్ అవసరం లేకుండా పనిచేస్తున్నాయని కిమ్స్ సర్జన్‌లు డాక్టర్ కేవీ కృష్ణ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడిందని, మరో రెండు రోజుల్లో ఆయనను సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు.
త్వరలోనే కోలుకుంటారు: చంద్రబాబు
‘నాతో ఎంతో సన్నిహితంగా ఉండే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయన్ని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎంతో కులాసాగా ఉన్నారు. తొందరగా కోలుకుంటారనే విశ్వాసం ఉంది’అని చంద్రబాబు చెప్పారు. దాసరి ఎంతో హుషారుగా ఉన్నారని, మాట్లాడలేకపోతున్నా పెన్‌తో తన ‘ఖైదీ నంబర్ 150’కలెక్షన్స్ గురించి అడిగారని చిరంజీవి తెలిపారు. కలెక్షన్లు రూ.250 కోట్లు దాటాలని ఆకాంక్షించారన్నారు.
చిరు, పవన్‌తో సినిమా: సుబ్బరామిరెడ్డి
‘ఇటీవలే దాసరిని కలిసినప్పుడు జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహించాలని మాట్లాడుకున్నాం. అంతలోపు అనారోగ్యానికి గురయ్యారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో చిత్రం తీస్తానని ప్రకటించగానే కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ టాప్ హీరోలే. సమానమైన పాత్రలతో కథ సిద్ధం చేయగానే సినిమా మొదలు పెడతాం. అయితే ఇది రాజకీయ ఉద్దేశాలతో తీసేది కాదు’అని సుబ్బరామిరెడ్డి వెల్లడించారు.