
(ఫైల్ ఫొటో)
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో బుధవారం బిజిబిజీగా గడిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో నేతలు బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో నేతలు చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అసెంబ్లీలో ఎండగట్టాలని దిగ్విజయ్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపికకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, కుంతియా సభ్యులుగా ఉన్నారు. అన్ని జిల్లాల నేతలతో కమిటీ సభ్యులు సంప్రదించి కొత్త అధ్యక్షులను ఎంపిక చేయాలని దిగ్విజయ్ సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై ఢిల్లీలో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అయా జిల్లాల నేతలు రేణుక చౌదరి, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్రెడ్డి లు తమ వారిని అధ్యక్షులుగా నియమించాలంటూ పట్టుబడ్డారు. దీనిపై దిగ్విజయ్ నేతలతో చర్చించినట్లు సమాచారం.
మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పార్టీ సీనియర్లు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. గురువారం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు చిదంబరం, ఆజాద్, జైరాం రమేష్ హాజరయ్యారు.