రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలకు గాయపడిన రైతాంగాన్ని పరామర్శించడానికి మల్లన్నసాగర్‌లో పర్యటిస్తామని, తమకు అనుమతి ఇవ్వడంతోపాటు భద్రతను కల్పించాలని టీపీసీసీ ముఖ్యనేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రాన్ని ఇచ్చారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలకు గాయపడిన రైతాంగాన్ని పరామర్శించడానికి మల్లన్నసాగర్‌లో పర్యటిస్తామని, తమకు అనుమతి ఇవ్వడంతోపాటు భద్రతను కల్పించాలని టీపీసీసీ ముఖ్యనేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో డీజీపీని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, నేతలు సునీతా లక్ష్మారెడ్డి, సురేష్‌శేట్కార్, పొన్నం ప్రభాకర్, జగ్గా రెడ్డి, కుసుమకుమార్, ఆరేపల్లి మోహన్, కిషన్, జడ్సన్, అనిల్‌కుమార్ యాదవ్, నేరేళ్ల శారద తదితరులు కలిశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రైతులను పరామర్శించడానికి వెళ్లడమే నేరమైనట్టుగా కాంగ్రెస్‌పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. మల్లన్నసాగర్‌లో 144 సెక్షన్ పెట్టినట్టుగా చెబుతున్న పోలీసులు అక్కడే టీఆర్‌ఎస్ నేతల ర్యాలీలకు మద్దతులను ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేసిన ప్రకటనలపైనా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటే కొట్టిస్తామని, జైల్లో పెడతామని ప్రకటనలు చేసిన మంత్రి తలసానిపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.