టీఆర్‌ఎస్ మాట్లాడింది గంట 26 నిమిషాలే
కాంగ్రెస్ 2.53 గంటలు: సీఎం
సాక్షి,హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ప్పటి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు టీఆర్‌ఎస్ మాట్లాడింది కేవలం గంటా 26 నిమిషాలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పదేళ్ల కాంగ్రెస్ హయాంలో, ఇరవై నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అందుకు వెచ్చించిన నిధుల గురించి పోలుస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేపీపక్ష నేత కె.లక్ష్మణ్ అడ్డుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రాబడి, ఖర్చుకు ప్రస్తుత పరిస్థితికి తేడా ఉందని జానారెడ్డి చెప్పగా.. కాంగ్రెస్ చేయలేదనే టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, పోలికలు ఎందుకని లక్ష్మణ్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఈటలకు, ప్రతిపక్షసభ్యులకు వాగ్వాదం జరుగుతుండగా, సీఎం జోక్యం చేసుకున్నారు.
‘అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాన్ని విని సంస్కారవంతంగా వ్యవహరించాలని జానా చెప్పారు. మీరు మాట్లాడితే సంస్కారం, మేం మాట్లాడితే కు సంస్కారమా?’ అని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు సభలో టీఆర్‌ఎస్ సభ్యులు కేవలం గంట 26 నిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు 2 గంటల 53 నిమిషాలు మాట్లాడారని ముఖ్య మంత్రి కేసీఆర్ వెల్లడించారు.