
జూ.ఎన్టీఆర్ కు టీటీడీపీ బాధ్యతలివ్వాలి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను నందమూరి కుటుంబానికే అప్పగించాలని ‘తమ్ముళ్లు’ డిమాండ్ చేశారు.
► తెలుగు తమ్ముళ్ల డిమాండ్
► ఎన్టీఆర్ భవన్‌లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను నందమూరి కుటుంబానికే అప్పగించాలని ‘తమ్ముళ్లు’ డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీటీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ద్వారా దివంగత ఎన్టీఆర్ అభిమానులకు పార్టీలో న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ అక్కడున్న లోకేష్ కటౌట్లను, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసినట్లు చూపించే ఫ్లెక్సీలను చించివేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
అలాగే పార్టీ హైదరాబాద్ నాయకుడు నైషధం సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో మరికొందరు నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. పార్టీ టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. అమ్ముకున్న టికెట్లను పార్టీని నమ్ముకున్న నిజమైన కార్యకర్తలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబును ఉద్దేశిస్తూ రాసిన వినతిపత్రాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి సమర్పించారు.
గ్రేటర్ టికెట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలు, నాయకులు సీట్లు అమ్ముకోవడం వంటివాటిపై విచారణ జరిపించాలని అందులో కోరారు. తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ కార్యకర్తలు, నాయకులను జలగల్లా పీక్కుతింటారన్నారు. చంద్రబాబు అందుబాటులో లేనందువల్లే ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించామని.. చంద్రబాబును కలసి గ్రేటర్‌లో జరిగిన సంఘటనలను వివరిస్తామని సత్యనారాయణమూర్తి చెప్పారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు సస్పెన్షన్
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో నారా లోకేష్ ఫ్లెక్సీలను చించివేసిన ందుకు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని టీఎన్‌ఎస్‌ఎఫ్ విభాగం ఇన్‌చార్జి కె.మదన్‌మోహన్‌రావు మీడియాకు తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అక్బర్‌బాగ్ డివిజన్ సీటును ఆశించిన శ్రీకాంత్‌రెడ్డికి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇతర టీడీపీ, అనుబంధ సంఘాల నేతలతో కలసి ఆయన బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో ధర్నా చేశారు.
లోకేష్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను చింపేశారు. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా భావించిన నాయకత్వం... శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని మదన్‌మోహన్‌రావును ఆదేశించింది. ఈ మేరకు శ్రీకాంత్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు మదన్‌మోహన్‌రావు ప్రకటించారు. అక్బర్‌బాగ్ డివిజన్‌లో నిర్వహించిన సర్వేలో శ్రీకాంత్‌రెడ్డి మూడోస్థానంలో ఉన్నందున టికెట్ ఇవ్వలేదని... టీడీపీ, బీజేపీ కూటమి కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని కార్యకర్తలు గుర్తించాలని పేర్కొన్నారు.