యజమాని ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: యజమాని ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గణేశ్, దీపేన్కా అనే ఇద్దరు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. నాగోల్ లోని బండ్లగూడకు చెందిన అష్టో అనే నగల తయారీదారుని కలిసి తమకు పని ఇవ్వాలని అడిగారు. అందుకు సరేనన్న అష్టో.. ఆ ఇద్దరికీ తన దుకాణంలోనే పని కల్పించాడు. యజమానితో నమ్మకంగా ఉంటూ ఆ ఇద్దరూ అదను చూసుకుని ఇటీవల అరకిలో బంగారు ఆభరణాలతో ఉడాయించారు. దీనిపై అష్టో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒడిశా వెళ్లి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, అక్కడి కోర్టు అనుమతితో శనివారం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వారి నుంచి 537 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు.