-శాసనమండలిలో మంత్రి కామినేని ప్రకటన
- ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఆపేశామని వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఉచిత అల్ట్రా స్కానింగ్ పరీక్షల సౌకర్యం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించారు. ఒక్క నెల రోజుల వ్యవధిలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. శాసనమండలిలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య పాలసీపై చేపట్టిన స్వల్పకాలిక చర్చకు మంగళవారం మంత్రి సమాధానమిచ్చారు. గ్రామాల్లో సబ్‌సెంటర్లు- అంగన్‌వాడీ కేంద్రాలు కలిసి పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కువ ప్రసవాలు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వైద్య విధాన పరిషత్ ద్వారా రెండు విడతలలో 1400 మంది డాక్టర్ల నియమాకాలు చేపట్టామని, మూడో విడతలో త్వరలో మరో 205 డాక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అపోలో సంస్థకు అప్పగించడాన్ని కొందరు తప్పుపడుతున్నారని.. ఈ ప్రక్రియలో అటు ప్రభుత్వానికీ, అపోలో సంస్థకు ఇద్దరికీ ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలంటే రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు అప్పగించినప్పటికీ, వారు రోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఉండదన్నారు. మిగిలిన ప్రభుత్వ ఆసుప్రతులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపేశామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లను ప్రైవేటీకరించే ఆలోచన లేదని కామినేని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు బయట సొంత ఆసుపత్రులను కూడా నిర్వహిస్తున్నవారిని 600 మందిని గుర్తించి తొలి హెచ్చరికగా వారందరి జీతాల నుంచి మూడు ఇంక్రిమెంట్లు చొప్పున కోత పెట్టినట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు మొత్తం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైజాగ్‌లోని విమ్స్ కొత్త భవనంలో వచ్చే నెల 11వ తేదీ నుంచి ఒపీ ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నామని, దానిని సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మహిళలకు ఇక ఉచితంగా అల్ట్రా స్కానింగ్
Published Tue, Mar 22 2016 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM
Advertisement
Advertisement