తడవకో మాట చెప్పొద్దు
ఎన్నికల హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి
వెంటనే శ్వేతపత్రం ప్రకటించండి
చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీల అమలుపై తడవకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించవద్దని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. వాగ్దానాలన్నిటినీ ఎప్పటికి నెరవేరుస్తారో తెలియజేస్తూ వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడారు.
సత్యం, అహింస అనేవి గాంధీజీ నమ్మిన మూల సిద్ధాంతాలని, వాటి అమలుకు ఎంతవరకు కట్టుబడి ఉన్నామో గాంధీ జయంతి సందర్భంగానైనా బాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఆయన ఎన్నికలపుడు ప్రజలకు చేసిన 40 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సత్యానికి కట్టుబడి అమలు చేయడం లేదని విమర్శించారు. గాంధీ సిద్ధాంతాలు ఆచరణలో చేసి చూపించాలన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున చేసిన తొలి ఐదు సంతకాల అమలు విషయంలోనూ బాబు వాగ్దాన భంగానికి పాల్పడ్దారని దుయ్యబట్టారు.
‘స్వరాజ్యం, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వాతంత్య్రం, గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన అనేవి గాంధీ ప్రధాన సిద్ధాంతాలు. వీటిల్లో ఏవీ రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. రైతు రుణ మాఫీ, పింఛన్ల పంపిణీ, తాగునీటి సరఫరా, బెల్ట్ షాపుల రద్దు, పదవీ విరమణ వయో పరిమితి పెంపు, ఇంటికో ఉద్యోగం లేకుంటే రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీలపై తడవకో మాట చెబుతూ బాబు సత్య దూరంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్య చేరుుంచడం, దాడులు చేయించడం వంటి చర్యలతో అహింసకు తిలోదకాలిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన వారిని తమ వైపు తిప్పుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. వీటన్నింటిపైనా బాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని ఉమ్మారెడ్డి హితవు చెప్పారు.
ఆ మాట బ్యాంకర్లను చెప్పమనండి
‘చంద్రబాబు సీఎం అయ్యే నాటికే రైతు రుణాల బకారుులు రూ.87,612 కోట్లు, డ్వాక్రా మహిళల రుణాలు రూ.15,000 కోట్లు ఉన్నట్లు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు చెప్పారు. షరతుల్లేకుండా రుణాలు రద్దు చేస్తామని తొలుత చెప్పి ఆ తరువాత మాట మార్చి పలురకాల ఆంక్షలు విధించి వాటిని రూ.43,000 కోట్లకు తగ్గించారు.వాటినైనా ఎప్పటిలోగా మాఫీ చేస్తారో శ్వేతపత్రం ప్రకటించాలి. మాఫీ విషయంలో బాబు ఒక రకంగానూ, నిధుల సేకరణ కమిటీ నేత సుజనాచౌదరి మరో రకంగానూ మాట్లాడుతున్నారు. రుణంలో 20 శాతమే బ్యాంకులకు చెల్లించి, మిగతా మొత్తానికి 10 శాతం వడ్డీతో బాండ్లు ఇస్తామంటున్నారు.
బాబు మాటలను నమ్మి రుణాలు చెల్లించని రైతులపై 14 శాతం వడ్డీ భారం పడింది. వరుసగా నాలుగేళ్లలో రుణ విముక్తి కలుగుతుందంటున్నారు. ఎన్నికలపుడు అలా చెప్పలేదే. పోనీ ప్రభుత్వం ఇచ్చే బాండ్లను అంగీకరిస్తామని, రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని బ్యాంకర్లను చెప్పమనండి. ఇదే విషయం విలేకరుల సమావేశం పెట్టి ఎందుకు చెప్పరు? మద్యం బెల్ట్ షాపులు తీసేశారో తెలియదు కానీ, డోర్ డెలివరీ సిస్టమ్ మాత్రం యధేచ్ఛగా సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడుతున్నది ఒక్క మద్యం ద్వారా వచ్చే ఆదాయమేనని పాలకులు చెబుతున్నారు. ఇందుకు సిగ్గుపడాలి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆదాయం పెంచుకుంటారా? గాంధీకి అర్పించే నివాళి ఇదేనా?’ అని ఉమ్మారెడ్డి నిలదీశారు.
జాతిపితకు, లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి
గాంధీజీ బాటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని, ఆ మహనీయుడి తత్వాలు, సిద్ధాంతాల బోధనకే తాము ప్రాధాన్యం ఇస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పార్టీ నేతలు పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో గాంధీ సిద్ధాంతాలు, ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు.
కొందరు మాత్రం పేదవాడికి సేవ చేస్తున్నామనే ముసుగులో ఆత్మవంచన చేసుకుంటున్నారని, అలాంటి వారికి తాము వ్యతిరేకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో చేసిన ప్రసంగాలు ప్రశంసనీయమైనవని, భారతదేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. శాస్త్రి నిరాడంబరత్వాన్ని ఆయన కొనియాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, పీఎన్వీ ప్రసాద్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ముఖ్యనేతలు గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్, చల్లా మధుసూదన్‌రెడ్డి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎస్.శేఖర్‌గౌడ్, గుడిమెట్ల సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, మహ్మద్‌లు పాల్గొన్నారు.