అసంఘటిత కార్మికుల సంక్షేమానికి చర్యలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలోని యు వతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతకు కొత్త పథకాలను రూపొందించే క్రమంలో కేంద్రం ఉందని వెల్లడించారు. దిల్‌కుశా అతిథి గృహంలో అసంఘటిత కార్మికుల అంశంపై రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్మిక, ఈఎస్‌ఐ,తదితర శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, నాయిని ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రీయ స్వాస్థ్ బీమా యోజన, ఇందిరాగాంధీ వృద్ధాప్య పెన్షన్లు, ఆమ్ ఆద్మీ బీమా యోజనలను కలిపి స్మార్ట్‌కార్డును రూపొం దించి ఒకే పథకంగా అమలుచేస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ కేంద్రాన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిపై పరిశీలన జరిపి రాష్ట్ర పునర్విభ జన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. వృత్తివిద్యలో నైపుణ్యాలను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 20 పెలైట్ ప్రాజెక్టులను అమలుచేస్తుండగా, జాబితా తెలంగాణను కూడా చేర్చామని హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఈ ప్రాజెక్టులు పనిచేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బీడీకార్మికుల కోసం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు.