
'క్షమించమని కోరితే భరోసాగా ఉండేది'
హైదరాబాద్: దళితులపై ఏపీ సీఏం చంద్రబాబు మానసిక దాడి చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోగా, ఎదురుదాడి చేయడం శోచనీయమని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆమె విలేకరులతో మాట్లాడారు. పొరపాటు దొర్లింది క్షమించమని చంద్రబాబు కోరివుంటే దళితులకు భరోసాగా ఉండేదని అన్నారు.
ముఖ్యమంత్రి బాధ్యాతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక పక్క కులాలను రెచ్చగొడుతూ, మరోపక్క ప్రతిపక్ష నాయకుడిపై ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రిమినల్ మైండ్ తో మాట్లాడుతున్నారని, అనవసరంగా ప్రతిపక్షాన్ని ఆడిపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తుని ఘటనపై ఢిల్లీలో చంద్రబాబుమాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కళ్లముందే తగలబడుతుంటే మంటలను ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తుని ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.