నగరంలో అదో ప్రముఖ దేవాలయం.. సత్యనారాయణ వ్రతాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వస్తుంటారు.
- నల్లబజారుకు తరలుతున్న దేవుడి సొమ్ము
- సికింద్రాబాద్‌లోని ప్రధాన దేవాలయంలో విజిలెన్స్ తనిఖీలో వెల్లడి
- 20 రోజులుగా సరుకులు వాడకుండానే అమ్ముకునే యత్నం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో అదో ప్రముఖ దేవాలయం.. సత్యనారాయణ వ్రతాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వస్తుంటారు. ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యమూ అలాంటిదే.. కానీ దాదాపు 20 రోజులుగా నెయ్యి లేకుండానే ప్రసాదాలు తయారవుతున్నాయి.. నిజంగా నెయ్యి లేదా అంటే ఉంది.. స్టోర్ రూమ్‌లో డబ్బాలకొద్దీ ఉంది.. మరి ఆ నెయ్యి ఏమవుతోంది? ఇప్పుడు ఇదే విషయంపై విజిలెన్సు అధికారులు దృష్టిసారించారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వెరసి రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో స్వామి ప్రసాదాలకు వినియోగించాల్సిన ప్రసాద సరుకులు సిబ్బంది చేతివాటంతో నల్లబజారుకు తరలుతున్న తీరు మరోసారి వెలుగులోకి వచ్చింది.
అసలు జరిగిందిదీ..
ఇటీవల నగరంలో ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ) సానుభూతిపరులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. వారు సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ దేవాలయం వద్ద పేలుళ్లు జరపాలని పథకం పన్నినట్టు జాతీయ భద్రతా సంస్థ దృష్టికి వచ్చింది. వారు ఆ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు కూడా తేలటంతో ఆలయాన్ని పరిశీలించాల్సిందిగా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలందాయి. దీంతో విజిలెన్స్ అధికారులు రెండు రోజుల కిందట ఆలయానికి వెళ్లి పరిశీలించే క్రమంలో పలు అక్రమాలు వెలుగుచూశాయి. జూన్ 10వ తేదీ తర్వాత ఆలయ స్టాక్ రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయలేదని తేలింది. జూన్ 10న నెయ్యి నిండుకుందని, ప్రసాదానికి వినియోగించే శనగలు కిలో మాత్రమే ఉన్నాయని, సత్యనారాయణ స్వామి వ్రతానికి వాడే ఖరీదైన వక్కలు అయిపోయాయని అందులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే అదే సమయంలో స్టోర్ రూమ్‌లో డబ్బాల కొద్దీ నెయ్యి స్టాక్ ఉంది. దాదాపు 175 కిలోల శనగలున్నాయి. ఉండాల్సిన దానికంటే 35 కిలోలకు పైగా అదనంగా వక్కలున్నాయి. అంటే గడచిన 20 రోజులుగా వాటిని వాడలేదు. స్టాక్ రిజిస్టర్‌లో.. సరుకు తెచ్చి అదీ అయిపోయినట్టు రాసి సరుకును నల్లబజారుకు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. భక్తులు కూడా ప్రసాదంలో నాణ్యత ఉండటం లేదని, నెయ్యి లేకుండానే నూనెతో లడ్డూలు తయారు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన విజిలెన్స్ విభాగం.. దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని తేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సికింద్రాబాద్‌లోని ఆ దేవాలయంలో కొందరు అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని అందులో పనిచేసే సిబ్బందే ఆరోపిస్తుండటం గమనార్హం.