చెక్ బౌన్స్ కేసులో మాల్యాపై నేరం రుజువు
మే 5న కోర్టులో హాజరు పర్చాలంటూ వారెంట్
సాక్షి, హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సంస్థను మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై నేరం రుజువైంది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువైందని బుధవారమిక్కడి మూడో ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది. శిక్ష ఖరారు చేసే ముందు నిందితుడికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున మే 5న మాల్యాను హాజరుపర్చాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అదే రోజున శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి ఎం.కృష్ణారావు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు పన్నుల రూపంలో జీఎంఆర్ సంస్థకు కింగ్‌ఫిషర్ రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే రాజీ ద్వారా రూ.22 కోట్లు ఇచ్చేందుకు కింగ్‌ఫిషర్ ముందుకు వచ్చిందని, ఇందుకు 45 చెక్కులు ఇచ్చిందని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ.50 లక్షల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశామని ఆయన వివరించారు.