=గోడకూలి ముగ్గురి దుర్మరణం.
=మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
=విజయనగర్ కాలనీలో ఘటన
మెహిదీపట్నం/విజయనగర్ కాలనీ, న్యూస్‌లైన్: కుండపోత ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. భారీ వర్షం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని బలిగొంది. గోడ కూలి ఇంటిపై పడడంతో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగర్‌కాలనీ కోటమ్మ బస్తీలో ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా భీవరానికి చెందిన గోతూరి పార్వతి (55) కుటుంబం విజయనగర కాలనీ సమీపంలో నివాసముంటోంది.
ఆమె పెద్ద కుమారుడు మావుళ్లు (30), ఆయన భార్య లక్ష్మి (26), కుమారులు శ్రీహరి, జనార్ధన్ (5)లతో కలిసి కోటమ్మ బస్తీలో ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రహరీని ఆనుకొని ఉన్న పూరి గుడిసెలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి ఎప్పటిలాగే నిద్రపోయారు. నాలుగు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రహరీ పక్కనే ఉన్న శిథిలాలు, మట్టిపెళ్లల కారణంగా ఒత్తిడి పెరిగి గోడ వారి ఇంటిపై పడింది. శిథిలాలు మీదపడి పార్వతమ్మ, లక్ష్మి, జనార్ధన్ నిద్రలోనే కన్నుమూశారు.
కొన ఊపిరితో ఉన్న మావూళ్లు, శ్రీహరి ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సమాచారమందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో మావుళ్లు, శ్రీహరిని శిథిలాల నుంచి వెలికి తీసి ఉస్మానియాకు తరలించారు. రెండు గంటల పాటు శ్రమించి పార్వతమ్మ, లక్ష్మి, జనార్ధన్ మృతదేహాలను వెలికితీశారు.
గంట ఆలస్యమైతే ప్రాణాలు దక్కేవి..
ఓ గంట ఆలస్యంగా ప్రమాదం జరిగితే బాధితులంతా ప్రాణాలతో బయటపడే వారని స్థానికులు పేర్కొంటున్నారు. మావూ ళ్లు కుటుంబ సభ్యులు రోజూ ఉదయం ఏడు కల్లా వంట చేసుకొని కూలి పనికి బయల్దేరే వారు. అయితే, ఏకదాటిగా వర్షం కురుస్తుండడంతో వారు నిద్ర లేవడంలో జాప్యం జరిగింది. గంట ఆలస్యంగా ప్రమాదం జరిగితే వారంతా ప్రాణాలతో బయటపడే వారని చుట్టుపక్కల వారు కన్నీరుమున్నీరయ్యారు. తెల్లవారక ముందే తమ వారి బతుకులు తెల్లవారిపోవడంతో పార్వతమ్మ చిన్న కొడుకు ఆదినారాయణ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఫిర్యాదు మేరకు హుమాయున్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. తమ వారి మృతికి బీఈడీ కళాశాల వారే కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేతల పరామర్శ..
ప్రమాద వార్త తెలిసి రాజకీయ నేతలు, అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు మతీన్ ముజదాది, పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్ రెహ్మాన్, నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.
స్థానికుల ఆందోళన
బాధితులకు తక్షణమే సహాయం అందించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను ఓ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లి, గేట్‌కు తాళం వేశారు. కలెక్టర్ వచ్చి ఎక్స్‌గ్రేషియా విషయమై స్పష్టమైన హామీ ఇస్తేనే మృతదేహాలను పోస్టుమార్టంకు పంపిస్తామని భీష్మించా రు. అలాగే, క్షతగాత్రులకు ఉస్మానియాలో సరైన వైద్యం అందడం లేదని, వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అక్కడకు చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు.
ఎక్స్‌గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అయితే, ఉత్తుత్తి హామీలు కాకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో.. మృతులకు ఒక్కొక్కరికీ వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, క్షతగాత్రులను ఉస్మానియా నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఆందోళన విరమించడంతో మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం రాత్రి 7 గంటల సమయంలో స్థానిక దేవునికుంట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
అక్రమ డంపింగే కారణం..
మూడేకరాల విస్తీర్ణంలో ఎత్తై ప్రదేశంలో ఉన్న బీఈడీ కళాశాల ప్రహరీ చుట్టూ దట్టమైన చెట్లపొదలు మొలిచాయి. ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం తో కొందరు గుట్టుచప్పుడు కాకుండా మట్టి, శిథిలాలను తీసుకొచ్చి ప్రహరీ పక్కన డంపింగ్ చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మట్టి కుంగి ప్రహరీ గోడపై ఒత్తిడి పెరిగింది. దీంతో అది కూలి కిందిభాగంలో ఉన్న ఇంటిపై పడింది. అయి తే, కళాశాలకు సెక్యూరిటీ గార్డును కొందరు భయపెట్టి అతడ్ని పంపించేశారని కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. రాత్రి సమయంలో డంపింగ్ చేస్తుండడంతో నియంత్రించ లేకపోయమన్నారు.
విషాదకరం
పొట్ట చేతపట్టుకొని జీవనోపాధి కోసం వచ్చి ఇలా మృత్యువాత పడ టం విషాదకరం. రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఇక్కడి పేదలకు నివాసయోగ్యంగా ఉండే పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
- బండారు దత్తాత్రేయ, బీజేపీ సీనియర్ నేత
సంఘటనలు జరిగినప్పుడే హడావుడి
ప్రమాదాలు జరిగినప్పుడే ప్రభుత్వం అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ యథాతథమే. దీనివల్ల అమాయకులు మృత్యువాత పడుతున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.
- తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీడీపీ నగర అధ్యక్షుడు