
ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్
హైదరాబాద్:
ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తూ ప్రమాదస్థాయికి చేరుకుంది. నీటిని వదిలేసేందుకు నీటిపారుదల ఏఈ వెంకటేష్ బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను హెచ్చరించడమేకాక, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియాతో చెప్పారు. హుస్సేన్ సాగర్‌కు బుధవారం ఉదయం వరకూ నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది ఇంకాస్త పెరిగితే నీటిని వదిలేయకతప్పదని ఆయన చెప్పారు. ఈ రోజు కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర శివారులోని నిజాంపేట చెరువుకు గండి పడడంతో నీరు కాలనీలను ముంచెత్తింది. అలాగే ఆల్వాల్ చెరువు పొంగి పొర్లడంతో పరిసరాల్లోని కాలనీలు నీట మునిగాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లు నీటితో నిండిపోయాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందువల్ల నిన్నటి నుంచి తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణలోని 294 ప్రాంతాల్లో వర్షం పడగా, 22 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసిందని ఆయన వివరించారు. నగరంలో 12 గంటల పాటు రాత్రంతా భారీ వర్షం పడిందని, ఈరోజు కూడా నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. మూసాపేట వద్ద రోడ్డు చెరువును తలపిస్తుండడంతో వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లుపై ఏర్పడిన గోతులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నాయి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అలాగే కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, బంజారాహిల్స్, ఎస్.ఆర్.నగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సూరారం కాలనీ, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, కర్మన్ ఘాట్ తదితర ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.