ఈ నెల 24న జరగనున్న పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల, కళాశాలల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది.
ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు పాఠశాలల, కళాశాలల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. సచివాలయంలో గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో జేఏసీ నేతలు సమావేశమై కానిస్టేబుల్ రాత పరీక్షకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తూ.. కాలేజీలపై పోలీసుల తనిఖీలు ఆపాలని కోరారు. దీనిపై మంత్రి నాయిని స్పందిస్తూ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్షకు సహకరిస్తామన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో జాక్ కన్వీనర్ జి.రమణారెడ్డి, తెలంగాణ డిగ్రీ కాలేజీల కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, జాక్ కో-కన్వీనర్ కె.సిద్దేశ్వర్ పాల్గొన్నారు.