
కేటీఆర్ అమ్మినచోటే.. మేమూ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతాం
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకోవడం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. నెల రోజులు కష్టపడి పనిచేసేవారు నెలకు 20 వేల రూపాయలు సంపాదిస్తుంటే, మంత్రి కేటీఆర్ ఒక్క రోజు కూలి పనిచేస్తే 7 లక్షల రూపాయలు రావడం విడ్డూరమని విమర్శించారు. టీఆర్‌ఎస్ కూలీలంతా ఓ డ్రామా అని ఆయన అభివర్ణించారు.
కేటీఆర్ ఐస్‌క్రీమ్‌లు అమ్మినచోట తాము కూడా అమ్ముతామని, తమకు అదే కూలి రాకపోతే అదే షాపు ముందు బైఠాయిస్తామని నాగేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీకి ఎవరెవరు ఫండింగ్ ఇస్తున్నారో తమ దగ్గర లిస్ట్ ఉందని చెప్పారు. సోమవారం ట్యాంక్ బండ్‌పై ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదర్శన చేపడతామని తెలిపారు.