అసెంబ్లీలో తీర్మానం వరకు కొనసాగుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడంపై సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో గురువారం రాత్రి భేటీ అయిన అనంతరం మంత్రులు శైలజానాధ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. భారతప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని శైలజానాధ్ వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయం ఏకపక్షమని, రాజ్యాగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండా ఓడించి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామాల విషయం ప్రస్తావించగా.. ‘‘సమైక్య రాష్ట్ర ప్రభుత్వమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి కనుక అంతవరకు మా ప్రభుత్వం ఉంటుంది. అప్పటివరకు మేము కొనసాగి ఆ తీర్మానాన్ని ఓడిస్తాం’’ అని శైలజానాధ్ వివరించారు.
‘‘మంత్రి పదవులతో ఏం ఒరగబెడతాం. శ్మశానాల్లో ఏం ఏరుకుంటాం..’ అని వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడతామని, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు పిలుపునిచ్చిన బంద్‌లో కాంగ్రెస్ నేతలు భాగస్వాములవుతారని చెప్పారు. 2004లో, 2009లో అత్యధిక ఎంపీలను ఇచ్చినందుకు మా గొంతు కోశారని, కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. విభజనలో తమపార్టీ అధినేతలతో పాటు ప్రతిపక్ష అధినేత కూడా భాగస్వాములుగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్‌కు ఏరాసు, గంటా, కాసు గుడ్‌బై
ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని పలువురు సీమాంధ్ర మంత్రులు భావిస్తున్నారు. ఇంకా ప్రభుత్వంలో, పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. వీరిలో మంత్రి పదవులకు రాజీనామా చేసి పార్టీలోనే కొనసాగాలని కొందరు మంత్రులు భావిస్తుంటే... పదవులతోపాటు పార్టీ పదవులకు కూడా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదించుకోవాలని, ఆ మేరకు శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవాలని నిర్ణయించారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఆయా మంత్రులు ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. అయితే సీఎం మాత్రం తొందరపాటు వద్దని బుజ్జగించారు.
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన తరువాత అందరం కలిసి అసెంబ్లీ సాక్షిగానే పదవులకు గుడ్‌బై చెప్పే అంశంపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. అప్పటి వరకు ప్రభుత్వంలో కొనసాగితే తమకు రాజకీయ మనుగడ ఉండదని, మంత్రి పదవులతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయకతప్పదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు సీఎంను కలిసిన వారిలో ఆయా మంత్రులతోపాటు శైలజానాథ్, టీజీ వెంకటేశ్ కూడా ఉన్నప్పటికీ వారు మాత్రం ఇప్పటికిప్పుడు రాజీనామా చేయకూడదనే భావనలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కొండ్రు మురళీమోహన్, పి.బాలరాజు తదితరులు మాత్రం పార్టీని వీడకూడదనే నిర్ణయానికి వచ్చారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలే తప్ప హైకమాండ్ నిర్ణయాన్ని దిక్కరించకూడదని భావిస్తున్నారు.