'సమైక్యానికి కిరణ్ ఒక్కడే చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు'
ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన శైలజానాథ్ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎంపీ నిధులతో నిర్మించిన సందర్శకుల గదిని ప్రారంభించారు.
అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కిరణ్ రాష్ట్ర విభజనకు అంగీకరించారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కాంగ్రెస్ ఆధిష్టాన్ని దృష్టిలో పెట్టుకుని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల రాజ్యాంగానికి కొత్త సమస్యలు వచ్చిపడతాయని శైలజానాథ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు సమ్మె చేస్తే రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామని శైలజనాథ్ ఈ సందర్బంగా వెల్లడించారు.