12 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం: కేసీఆర్ | we will give 12 percent of reservation for muslims says kcr | Sakshi
Sakshi News home page

12 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం: కేసీఆర్

Published Sun, Jun 26 2016 9:47 PM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM

12 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం: కేసీఆర్ - Sakshi

12 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరుతాం: కేసీఆర్

హైదరాబాద్:
'నా మాట అంటే మాటే. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తా. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం కోసం ఎంక్వైరీ కమిటీని వేశాం. కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత అసెబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ముస్లిం రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఢిల్లీకి పంపిస్తాం. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విజయం సాధిస్తామన్న ధీమా ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని ఆదివారం నిజాం కళాశాల మైదానంలో ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లింలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం విద్యార్థుల కోసం రూ.390 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 120 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ముస్లింల పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో హిందూ ముస్లింల సమైక్యతకు సంబంధించి ఒకనాటి గంగాజమున తహజీద్ ప్రపంచ ఖ్యాతి గడించిందని, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను గ్రహించి ఆ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 200 మసీదుల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుల్లో లక్ష మంది ముస్లింలు ఆనందోత్సవాలతో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుల ఏర్పాటు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు శుభకాంక్షాలు తెలిపారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రంజాన్ మాసం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాం సర్కార్ హాయాంలో సైతం లేని సత్ సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టింపజేశారన్నారు. రంజాన్ పండుగ కోసం పేద ముస్లింలకు ఒక కుర్తా పైజామా, రెండు చీరలతో కూడిన ప్యాక్‌ను కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయా, శాసనమండలి చెర్మైన్ స్వామి గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహ రెడ్డి, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, ఏసీబీ డీజే ఏకేఖాన్, మైనారిటీల సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, ఇరాన్ కన్సులేట్ జనరల్(హైదరాబాద్) హసన్ నౌరీన్, టర్కీ కాన్సులేట్ జనరల్ అర్డా ఉల్టాజ్, నగర మేయర్, డిప్యూటీ మేయర్లు బొంతు రామ్మోహన్, బాబా ఫసియొద్దీన్, ఎమ్మెల్సీ యండీ సలీం తదితరులు పాల్గొన్నారు. అతిథులతో ఇఫ్తార్ విందుకు హాజరైన వారితో సీఎం కేసీఆర్ కలిసి విందు భోజనాన్ని ఆరగించారు. ఇఫ్తార్ అనంతరం ముస్లింలకు మగ్రీబ్ నమాజ్ చదువుకోడానికి ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు ఇఫ్తార్ విందుకు హాజరైన అనాథ ముస్లిం బాలబాలికలకు సీఎం కేసీఆర్ కానుకలు అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement