
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా అకస్మాత్తుగా మబ్బులు కమ్మి వర్షాలు కురుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వరకు ఎర్రటి ఎండ ఉన్నా కాసేపట్లోనే వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌లో ఎండ వేడి తాళలేకపోతుంటే.. హయత్‌నగర్‌లో వాన దంచి కొడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ‘గ్రేటర్’ప్రజలకు నగర వాతావరణ వివరాలు తెలిసేలా వాతావరణ శాఖ అనుసంధానించిన సమాచారంతో ‘మై జీహెచ్‌ఎంసీ’యాప్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఐటీ) ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. వర్షం కురిసినపుడు వర్షపాతం, వర్షం కురిసిన ప్రాంతం వివరాలు, ఇతర సమయాల్లో వాతావరణ ఉష్ణోగ్రతల సమాచారం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
వీటితోపాటు రాబోయే 5 రోజుల్లోని వాతావరణ సూచనలు, హెచ్చరికలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. నగరానికి కొత్తగా వచ్చేవారు తామెక్కడున్నామో, ఆ ప్రాంతం జీహెచ్‌ఎంసీ ఏ సర్కిల్, జోన్ పరిధిలోకి వస్తుందో తెలుస్తుందని, రూ.5 భోజన కేంద్రాలు, ప్లే గ్రౌండ్, పబ్లిక్ టాయ్‌లెట్లు ఎంత దూరంలో ఉన్నాయో తెలుస్తుందని చెప్పారు. మొత్తంగా 120 సర్వీసులు యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు వివరాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా యాప్‌లో అందుబాటులో ఉండటం తెలిసిందే.