సాక్షి, హైదరాబాద్ : బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న భవనాల పరిశీలనకు ప్రత్యేక యాప్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) విని యోగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ ను తెచ్చిందే అక్రమ నిర్మాణాల కోసం. ఈ అక్రమాల్లోనూ అక్రమాలకు పాల్పడ్డవారు ఎందరో ఉన్నారు. వీరి అక్రమాలను రెగ్యుల రైజ్ చేయకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది.
బీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అనుమతించిన తేదీ (కటాఫ్ తేదీ) తర్వాత నిర్మించిన అక్రమ భవనాలను క్రమబద్ధీకరించకూడదని భావిస్తోంది. దీనికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) సహకారంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సదరు అక్రమ భవనాలను గుర్తించనున్నారు. దీనికోసం ఎన్‌ఆర్‌ఎస్‌ఏ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను వినియోగించనున్నా రు. ఈ యాప్, ఉపగ్రహ ఛాయాచిత్రాలతో కటాఫ్ తేదీ తర్వాత నిర్మించిన భవనాలను, అదనపు అంతస్తులను గుర్తిస్తారు.
యాప్ ద్వారా గుర్తిస్తారిలా..
♦ ప్రస్తుతం తుది దశలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తయ్యాక.. వచ్చే నెల నుంచి బీఆర్‌ఎస్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ పరిశీలన ప్రారంభించనున్నారు.
♦దరఖాస్తులన్నీ సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
♦ క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించి, ప్రస్తుతం ఉన్న నిర్మాణం ఫొటోలను అప్‌లోడ్ చేసేందుకు ఎన్‌ఆర్‌ఎస్‌ఏ రూపొందించిన యాప్‌ను వినియోగిస్తారు.
♦ఉదాహరణకు ఒక దరఖాస్తును ఆన్‌లైన్‌లో పరిశీలించిన అధికారులు.. సదరు వివరాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. దరఖాస్తులో పేర్కొన్న భవనాన్ని వివిధ కోణాల్లో ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేసి ఎన్‌ఆర్‌ఎస్‌ఏకు పంపిస్తారు.
♦ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సదరు భవనం కటాఫ్ తేదీకి ముందు నిర్మించినదేనా.. లేక ఆ తర్వాత ఏవైనా అదనపు అంతస్తులు నిర్మించారా.. కటాఫ్ తర్వాతే మొత్తం భవనం నిర్మించారా తదితర వివరాలను గుర్తిస్తుంది. ఆ వివరాలు సీజీజీ ద్వారా జీహెచ్‌ఎంసీకి తెలుస్తాయి.
♦కటాఫ్ తేదీకి ముందు నిర్మించిన వాటికి నిర్ణీత పెనాల్టీలు విధించి క్రమబద్ధీకరిస్తారు. కటాఫ్ తర్వాత నిర్మించినవైతే కూల్చేస్తారు.
♦ పదేళ్ల క్రితం బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) అమలు చేసినప్పుడు కటాఫ్ తేదీ తర్వాత నిర్మించిన భవనాలెన్నో రెగ్యులరైజ్ అయ్యాయి. పలువురు బిల్డర్లు, కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారులు కుమ్మకై కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌లో అది పునరావృతమవకుండా చర్యలు చేపట్టారు.యాప్ వినియోగంపై టౌన్ ప్లానింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు.
కటాఫ్ తేదీ తర్వాత కూడా..
నగరంలో అక్రమ భవనాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015లో బీఆర్ ఎస్‌ను ప్రకటించింది. ఆ ఏడాది అక్టోబర్ 28 లోపు నిర్మించిన అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఆ తేదీలోగా అక్రమ భవనాలు లేని వారు సైతం బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుని, ఆ తర్వాత అడ్డదిడ్డంగా భవనాలు నిర్మించారు. బీఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరిస్తారని, కటాఫ్ తేదీ తర్వాత సైతం అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు.
ఇలా ఎన్నో అదనపు అంతస్తుల నిర్మాణం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు.. అలాం టి వాటిని క్రమబద్ధీకరించకుండా ఎన్‌ఆర్‌ఎస్‌ఏ సహకారం తీసుకుంటున్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ప్రత్యేక యాప్‌ను వినియోగించి కటాఫ్ తేదీ తర్వాత నిర్మించిన అదనపు అంతస్తులు, భవనాలు గుర్తిస్తారు. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమబద్ధీకరించరు. వాటిని కూల్చేయాల్సిందిగా సంబంధిత యజమానులకు నోటీసులిస్తారు. వారు కూల్చివేయని పక్షంలో జీహెచ్‌ఎంసీయే కూల్చివేసి, ఆ మేరకు చార్జీలు వసూలు చేయనుంది.
జీహెచ్‌ఎంసీలో నివాస భవనాలు దాదాపు - 12,50,000
నివాసేతర భవనాలు దాదాపు - 2,75,000
బీఆర్‌ఎస్‌కు అందిన మొత్తం దరఖాస్తులు - 1,21,019
Comments
Please login to add a commentAdd a comment