అన్నంత పనీ చేశాడు
- మామను నరికి చంపిన అల్లుడు
- కట్నం కేసులో జైలుకు పంపాడని దారుణం
జియాగూడ: కట్నం వేధింపుల కేసులో జైలుకు పంపాడన్న కక్షతో మామ ప్రాణం తీశాడో దుర్మార్గుడు. హత్య చేస్తానని హెచ్చరించి మరీ అతిదారుణంగా నరికి చంపాడు. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఆర్.కరణ్‌కుమార్‌సింగ్ కథనం ప్రకారం... పురానాపూల్ దుర్గానగర్ నివాసి టి.మనోహర్ సింగ్(49) ఛెత్త్తాబజార్ ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి హారతిని కుల్సుంపురా 2జే బస్టాండ్ వద్ద ఉంటున్న రాంసింగ్ కుమారుడైన సిటీ సివిల్ కోర్టు ఉద్యోగి ఆనంద్‌సింగ్(24)కు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు.
కట్నం కింద 40 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు ఇచ్చారు. వీరికి ఏడాది పాప ఉంది. కాగా, ఆనంద్‌సింగ్ అదనపు కట్నం అడుగుతుండటంతో మనోహర్‌సింగ్ ఇటీవల మారుతి వ్యాన్‌ను కొనిచ్చాడు. అయినా సంతృప్తి చెందని ఆనంద్‌సింగ్ అదనపు కట్నం తెమ్మని భార్య హారతిని కాల్చుకు తింటున్నాడు. అనుమానంతో ఆమెను నిత్యం మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడు. పలుమార్లు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో మామ మనోహర్‌సింగ్ రెండు నెలల క్రితం సీసీఎస్‌లో వరకట్నం వేధింపుల కేసు పెట్టాడు.
పోలీసులు ఆనంద్‌సింగ్‌ను జైలుకు పంపారు. దీంతో కక్షగట్టిన ఆనంద్‌సింగ్ వారం రోజులుగా మామను హత్య చేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నట్టుగానే మామను హత్య చేసేందుకు పథకం వేశాడు. మామ ఏ సమయంలో ఎక్కడికి వెళ్తాడనే విషయం ముందే పసిగట్టిన అతను శనివారం ఉదయం పురానాపూల్ చౌరస్తా దిగువన ఉన్న రోడ్డు వద్ద మరికొందరితో కలిసి మాటు వేశాడు.
ఉదయం 9.30కి పురానాపూల్‌లో పాలప్యాకెట్లు కొనుగోలు చేసి దుర్గానగర్ కు స్కూటర్‌పై వస్తున్న మామ మనోహర్‌సింగ్‌పై ఒక్కసారిగా దాడి చేసి, కత్తులతో నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని గోషామహల్ ఏసీపీ రాంభూపాల్‌సింగ్, కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ కరణ్‌కుమార్‌సింగ్ పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు.