సర్కారీ బడులు బాగుపడేదెప్పుడు?
తెలంగాణ వచ్చినా పరిస్థితి మారకుంటే ఎలా?
♦ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షాలు
♦ జయశంకర్ ఉండి ఉంటే ఆవేదన చెందేవారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే
♦ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలి: బీజేపీ ఎమ్మెల్యే చింతల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ఇప్పటికీ దిగదుడుపుగానే ఉందని విపక్షాలు ఆరోపించాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని విమర్శించాయి. పద్దులపై చర్చలో చివరి రోజైన సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ విద్యపై సభ్యులు మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పదేపదే చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గడచిన 21 నెలల్లో దాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో కేజీ టు పీజీ మినహా అన్నింటినీ నెరవేర్చామని సీఎం పేర్కొంటున్నా... ఆ హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆమె అన్నారు. ‘‘తెలంగాణ వస్తే విద్యావ్యవస్థ గొప్పగా ఉంటుందని ఆశించిన ఆచార్య జయశంకర్ ఇప్పుడు బతికి ఉంటే తీవ్రంగా ఆవేదన చెంది ఉండేవారు. కేజీ టు పీజీ గురించి గొప్పగా చెప్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం విధానపత్రం కూడా విడుదల చేయలేదు. ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవటం, పాఠశాలల్లో వసతులు సరిగా లేకపోవటం, ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది’’ అని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయనున్నారో ప్రస్తుత సమావేశాల్లోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘‘మహబూబ్‌నగర్ జిల్లాలోని చింతలకుంట ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగా లేకపోవటాన్ని విద్యార్థులు లేఖ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాల్సి వచ్చింది. ఇప్పుడు టెట్ పరీక్ష శిక్షణ కోసం వారు కూడా సెలవుపెట్టి వెళ్లిపోయారు’’ అని చెప్పారు.
మోడల్ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించాలి
మోడల్ పాఠశాలల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు. అప్పట్లో ప్రారంభమైన కొన్ని మోడల్ స్కూళ్లను ఇప్పుడు మూసేస్తున్నారని, దీంతో వాటి లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందన్నారు. ప్రైవేటు పాఠశాలలు ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నందున ప్రభుత్వం ఫీజు నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలోని గీతం తరహాలో తెలంగాణలో కూడా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
స్కూళ్లలో వసతులు కల్పించాలి: చింతల
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలు మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని, ఇంత ఖర్చు చేస్తున్నా ఆయా బడుల్లో విద్యార్థుల సంఖ్య నామమాత్రంగా ఉంటోందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీ, ప్రతి ఆర్డీవో డివిజన్ పరిధిలో డిగ్రీ కాలేజీ ఉండాలన్నారు.