సర్కారు వైఖరిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులు చేతులు మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌మెంట్ ఆస్తులు ప్రకటించడంలో ఆంతర్యమేమిటో వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. అగ్రిగోల్డ్ అక్రమాలపై నెల్లూరు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యేంతవరకు చంద్రబాబు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారో చెప్పాలని డిమాండ్ చేసింది. సోమవారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు పోలుబోయిన అనిల్‌కుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పనలు మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుపట్టిన తర్వాత ప్రభుత్వం స్పందించిందని, అయితే చివరకు బాధితులకు మనోవేదనే మిగిల్చిందని దుయ్యబట్టారు.
అగ్రిగోల్డ్ విషయంలో హైకోర్టు సీఐడీని ఆక్షేపించిందని, బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం కలగడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తమ బినామీల పేరిట ఆస్తుల్ని బదలాయించిన తర్వాత ప్రభుత్వం అటాచ్‌మెంటు ఆస్తులు ప్రకటించడం దారుణమని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ 14 ఎకరాల విలువైన భూములు కొనుగోలు చేసిన తర్వాత, తిరుపతిలో రూ.14 కోట్ల అత్యంత విలువైన ఆస్తులు తమ పార్టీ నేతలు చేజిక్కించుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. భూ కుంభకోణాల్లో తన పేరే వెలుగులోకి వస్తోందని మంత్రి పుల్లారావు నిండు సభలో వాపోతున్నారని, అయితే భార్య దందాలు మార్మోగడమే ఇందుకు కారణమనే విషయాన్ని మంత్రి గుర్తెరగాలని అన్నారు. తమ అక్రమాలు ఎక్కడ వెలుగు చూస్తాయోనన్న భయంతోనే అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు ప్రభుత్వం భయపడుతోందని పిన్నెల్లి అన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి 155 కంపెనీలుంటే, కేవలం ముగ్గురిని అరెస్ట్ చేశారంటే ప్రభుత్వం నిందితులను కాపాడుతున్నట్లా? కాదా? అని ఉప్పులేటి కల్పన ప్రశ్నించారు.
సర్కారు రహస్య ఎజెండా: కోటంరెడ్డి
అగ్రిగోల్డ్ అక్రమాలపై సభలో చర్చించేందుకు టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీకి అవకాశం ఇవ్వకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ రహస్య ఎజెండా ఏమిటో అర్ధమవుతోందని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో ప్రభుత్వ పాత్ర ఎంతగా లేకపోతే మిత్రపక్షమైన బీజేపీ నోరు కూడా నొక్కేస్తుందని ప్రశ్నించారు.
ఆస్తులు చేతులు మారాక అటాచ్ చేస్తారా?
Published Tue, Mar 29 2016 2:39 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement