
హోదాతోనే అభివృద్ధిలో పోటీ
ప్రత్యేక హోదాతోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్
ఏపీకి కూడా సాధించుకోండి మేమూ మద్దతిస్తాం
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో ఉత్తరాఖండ్ సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదాతోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి స్పష్టం చేశారు. రెవెన్యూ లోటు కారణంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతోనే త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉందని లేకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. హోదా సాధించుకునే విషయంలో తాము కూడా పూర్తి మద్ధతు ఇస్తామని హామీ ఇచ్చారు.
హిమాలయాలనుంచి తిరిగి వస్తూ రఘువీరారెడ్డి శుక్రవారం డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ సీఎం తో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా అమలుతోనే విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు వచ్చాయన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ అప్పట్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే తీర్మానించామని ఆ విషయంలో ఏపీకి సంపూ ర్ణ మద్దతిస్తామని రఘువీరాకు ముఖ్యమంత్రి రావత్ స్పష్టమైన హామీ ఇచ్చారు.