ఫుట్పాత్పై పురుడుపోసిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ : మిట్టమధ్యహ్నం భానుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండగా ఓ నిండు చూలాలు భర్తతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఒక్క అడుగూ ముందుకు నడవలేకపోయింది. బాధను బిగబడుతూ ఉన్నచోటనే కూలబడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆ మహిళ దగ్గరికి వచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్లే టైమ్ లేదు. చుట్టుపక్కనవాళ్లనడిగి చీరలు తెప్పించి ఫుట్ పాత్ చూట్టూ చీరలు అడ్డంగా కట్టి, మహిళా కానిస్టేబుళ్లే పురుడుపోశారు.
పుట్టిన పండంటి మగబిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని, అప్పటికప్పుడు తెప్పించిన వస్త్రాల్లో చుట్టి పడుకోబెట్టారు. అనంతరం బాబును, తల్లిని ఆంబులెన్స్ లో కోఠిలోని ప్రసూతి వైద్యశాలకు తరలించారు. హైదరాబాద్ లోని నారాయణగూడా శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుందీ సంఘటన. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. వారి వివరాలు తెలియాల్సిఉంది.