ఉమెన్స్ హాస్టల్లో కూలిన పైకప్పు
హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో అభిశ్రీ ఉమెన్స్ హాస్టల్ పైకప్పు శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన భారీ గాలివానకు కూలిపోయింది. ఐదవ అంతస్తులో హాస్టల్ నిర్వాహకుడు రేకులతో షెడ్డు వేసి అందులో వసతి ఏర్పాటు చేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డువేసి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో గాలికి రేకులు ఎగిరిపోయాయి. ఐరన్ పోల్స్ కూలి విద్యార్థినులపై పడిపోయాయి. తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా సుమారు 20 మంది విద్యార్థినుల సర్టిఫికెట్లు, బుక్స్ ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇంత జరిగినా హాస్టల్ నిర్వాహకుడు హాస్టల్‌కు రాకుండా ఉండడం గమనార్హం. దీంతో విద్యార్థినులు జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వద్ద గోడ కూలిపోవడంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి.