
లేని వారిపై బురద చల్లడం దేనికి?
లేని వారిపై బురద చల్లడం ఎందుకని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘మిస్సమ్మ బంగ్లా’ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత
సాక్షి, హైదరాబాద్: లేని వారిపై బురద చల్లడం ఎందుకని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అనంతపురంలోని మిస్సమ్మ బంగ్లాలో 7.30 ఎకరాలను అక్రమంగా అమ్మారని, ఈ వ్యవహారం వైఎస్ ప్రభుత్వ హయాం లోనే జరిగిందని టీడీపీ సభ్యులు శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘ఈ కేసుకు సంబంధించి సీఐడీ విచారణ చివరిదశలో ఉందని, ఈ నెలాఖరుకు పూర్తవుతుందని మీరే(మంత్రి) చెబుతున్నారు కదా? విచారణను పూర్తి చేయండి. దోషులుంటే చర్యలు తీసుకోండి. అంతేగానీ లేని వారిపై బురద చల్లడం దేనికి? ఇది వైఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనే మాట అవాస్తవం’’ అని జగన్ స్పష్టం చేశారు.
ఈ అంశంపై వైఎస్ కుటుంబ సభ్యులపైన, వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపైనా ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, అధికారపక్ష ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, పార్థసారథి తదితరులు ఆరోపణలు చేయడాన్ని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు తప్పుబట్టారు. ఇది కోర్టులో ఉన్నందున దీని గురించి సభలో మాట్లాడటం తప్పని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సభలో లేనివారిపై బురద చల్లడం మంచిది కాదన్నారు. బద్వేలు, కోడూరు పట్టణాల్లో మైనారిటీలకు చెందిన విలువైన ఆస్తులను అధికారపార్టీ వారు ఎలా స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.