ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించి, ఈ నిధులు పక్కదారి పట్టకుండా పూర్తిగా ఖర్చు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో సబ్‌ప్లాన్ అమలు అధ్వానంగా ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కంటి తుడుపు చర్యగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు కమిటీలు వేసిందని పేర్కొంది. తెలం గాణ ఏర్పడి 31 నెలలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మూడేళ్లుగా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్‌లో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. హక్కుల కోసం పోరాడిన దళితులు, గిరిజనులు.. వాటి అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భూమి లేని దళిత కుటుంబాలు 1.5 లక్షల వరకు ఉండగా, రెండున్న రేళ్లలో కేవలం 3,671 కుటుంబాలకు 9,663 ఎకరాల భూపంపిణీ మాత్రమే జరిగిందన్నారు. ఈ ఏడాది నిధులు ఖర్చు కాకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే బడ్జెట్‌లో మిగులుగా చూపించాలని.. అయితే ఈ ప్రభుత్వం ఆ నిధులను ఇతర పథకాలకు తరలిస్తోందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని అంశాలను స్వయంగా వివరించిన సీఎం కేసీఆర్ సబ్‌ప్లాన్‌పై చర్చలో మాత్రం పాల్గొనకపోవడాన్ని బట్టి ఎస్సీ, ఎస్టీల విషయంలో ఆయన వైఖరి ఏమిటో స్పష్టమవుతోందని విమర్శించారు.