'ఎట్ హోం'లో అరుదైన కలయికలు | YS Jagan mohan reddy shake hands with KCR in 'At Home' | Sakshi
Sakshi News home page

'ఎట్ హోం'లో అరుదైన కలయికలు

Published Mon, Aug 15 2016 10:38 PM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM

YS Jagan mohan reddy shake hands with KCR in 'At Home'


సాక్షి, హైదరాబాద్ :
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇచ్చిన ఎట్ హోం ఆహ్లాదకరంగా జరిగింది. తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, ఎన్.చంద్ర బాబు నాయుడు హాజరయ్యారు. కాగా, ఇద్దరు సీఎంలు కేవలం పలకరింపులకు మాత్రమే పరిమితం అయ్యారు. ఏ ఇతర అంశాలపై వారు మాట్లాడుకోలేదు. మరో వైపు తొలిసారిగా ఎట్‌హోమ్ కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎట్ హోమ్‌కు హాజరు కావడం సంతోషం కలిగించిందని గవర్నర్ ఈ సందర్భంగా వైఎస్.జగన్‌తో పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాల శాసన సభా స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్‌రావు, మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వైఎస్ జగన్‌తో సీఎం కేసీఆర్ ఆత్మీయ కరచాలనం

ఎట్ హోమ్‌కు హాజరైన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ వెళుతూ ..తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరకు రావడంతో ఆయన లేచి కరచాలనం చేశారు. తెలంగాణ మంత్రులూ ఆయనకు వీడ్కోలు పలికేందుకు లేచి కరచాలనం చేశారు. ఇదే సమయంలో ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి వైఎస్. జగన్ చేయి పట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకు వెళ్లి కరచాలనం ఇప్పించారు. కాగా, అంతకు ముందు ఆరంభంలోనే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, అది  గమనించని ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి మరో సారి చేతులు కలిపించారు.


కాగా, ఇద్దరు సీఎంల నడుమ గవర్నర్ నర్సింహన్ కూర్చున్నారు. ఈ సమయంలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. అతిథులను కలిసేందుకు గవర్నర్ వెళ్లిపోవడంతో చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వేర్వేరుగా మాట్లాడుతూ కూర్చున్నారు. కార్యక్రమం నుంచి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ తొలుత వెళ్లిపోయారు. ఆయనతో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కొద్దిసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్ జగన్ వెళ్లిపోయిన కొద్ది సేపటికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా వెళ్లి పోయారు. అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరి సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతూ కూర్చున్నారు.

మీరు సంతృప్తి చెందారా : మీడియాతో గవర్నర్

ఇద్దరు సీఎంలను వెంట బెట్టుకుని బటయకు వచ్చిన గవర్నర్ నరసింహన్ మొదట్లోనే ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. గత స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఇచ్చిన ఎట్‌హోంకు ఇద్దరు సీఎంలు హాజరు కాలేదు. ఆ సమయంలో ఇద్దరి గైర్హాజరీపై వచ్చిన ప్రశ్నలను గుర్తు చేస్తూ ..‘ ఈ సారి మీకు ఆ అవకాశం లేదు.. మీరు సంతప్తి చెందినట్టేనా..’ అని వ్యాఖ్యానించారు. ‘ ఫుల్ మూన్ ’ అంటూ మీడియా ప్రతినిధులు అనడంతో.. ‘ మీరు ఎక్కువ ఆశిస్తున్నట్టుంది..’ అని గవర్నర్ ప్రశ్నించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్  ‘ఇది ఎట్ హోం ’ అంటూ ముందుకు కదలడంతో గవర్నర్, ఏపీ సీఎంలు ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే ముందుకు కదిలారు. ఎట్ హోంకు ఒకింత ఆలస్యంగానే వచ్చిన చంద్రబాబు కార్యక్రమం ఆరంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు.

ఎట్ హోం ముగిశాక సీఎం కేసీఆర్, గవర్నర్‌లు రాజ్‌భన్‌లోకి వెళుతూ మరికొద్ది సేపు మీడియా ప్రతినిధుల వద్ద ఆగారు.‘ సీఎంను మీకు  అప్పగిస్తున్నాను..’ అని గవర్నర్ అనడంతో సీఎం మీడియా ప్రతినిధులతో ఫోటోలు దిగారు. అదే సమయంలో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను ఆయనే ప్రస్తావిస్తూ త్వరలోనే చేసేద్దాం అంటూ ముందుకు కదిలి వెళ్లారు. ఈ కార్యకర్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్,  సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ నుంచి ఎవరూ ఎట్ హోమ్‌కు హాజరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement