
దేవినేనిని అలా వదిలేయకండి
- వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ సూచన
- జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే అవాకులు, చవాకులు
సాక్షి, హైదరాబాద్: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తన, మాటలు చూస్తుంటే ఒక మానసిక రోగి అయిపోయారనిపిస్తోందని, ఆయన్ని అలా వదిలేయకుండా తక్షణమే వైద్యునికి చూపించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ అరాచకాలు, మోసాలు, అబద్ధపు హామీలను నరసరావుపేట బహిరంగ సభ సాక్షిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎత్తిచూపడాన్ని తట్టుకోలేక.. ఆయనపై టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించడమే జగన్ చేసిన నేరమా? కార్లు, పొలాలు తగలబెట్టినా, ప్రజలపై దాడి చేసినా చూస్తూ ఊరుకోవాలా? అని ఆమె నిలదీశారు.
జగన్ లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేక ఆయనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని మంత్రికి వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.
గాలి, ధూళి, మన్నూ, మశానమంతా టీడీపీలోనే..
వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలను ఆమె ప్రస్తావిస్తూ.. గాలి, ధూళి, మన్నూ, మశానం వంటి వారందరూ ఉన్న టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక అసెంబ్లీకి రావద్దని దేవినేని అంటున్నారని విమర్శించారు.
దమ్ముంటే వీటిపై విచారణ జరిపించడండి
రాజధానిలో పొలాలు, తునిలో రైలును తగలబెట్టిన విష సంస్కృతి టీడీపీదని, దమ్ముంటే ఈ కేసులపై విచారణ జరిపించాలని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చెప్పినట్లు వినలేదనే కారణంతో గుంటూరు ఎస్పీగా ఉన్న రామకృష్ణను టీడీపీ నేతలు బదిలీ చేయించారని ఆరోపించారు.