చంద్రబాబు భూదోపిడీకి హైకోర్టు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు భూదోపిడీకి హైకోర్టు అడ్డుకట్ట వేసిందని సదావర్తి సత్రం భూముల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సదావర్తి భూములను కట్టబెట్టేందుకు ఇపుడు ప్రభుత్వం ఖరారు చేసిన మొత్తం మీద అదనంగా రూ 5 కోట్లు చెల్లిస్తే భూమిని మీకే కేటాయిస్తామని హైకోర్టు తీర్పును ఇచ్చిందని ఆ మేరకు నిర్ణీత గడువు లోపుగా డబ్బు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి వారి సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని అతి విలువైన భూములను టీడీపీ నేతలు కారు చౌక ధరకే కొట్టేయాలని చూశారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీల ద్వారా ప్రభుత్వ, ప్రజల, దేవుడి భూములను దోచుకు తింటున్నారని ఆయన విమర్శించారు. 84 ఎకరాల భూములను రూ.22 కోట్లకే కట్టబెట్టడంతో తాము హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశామని తెలిపారు.