హైదరాబాద్ : ప్రత్యేక హోదా తప్ప రాష్ట్ర అభివృద్ధికి మరో మార్గం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 15 నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసినా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఏ అంశంపైన అయినా చర్చకు సై అంటున్న ప్రభుత్వం హోదాపై చర్చకు మాత్రం నై అంటుందోని ఎద్దేవా చేశారు. అసలు సభలోకి మార్షల్స్ ఎందుకు వచ్చారని కోటంరెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ చరిత్రలో సభలోకి మార్షల్స్ రావడం ఇదే తొలిసారి అని, స్పీకర్ ఆదేశాలు లేకుండానే సభలోకి మార్షల్స్ వస్తారా అని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ ఐదుకోట్లమంది ప్రజల జీవన్మరణ సమస్య ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు. శనివారం జరగనున్న బంద్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు.
ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి ముందు చంద్రబాబు పుట్టుంటే బ్రిటిష్ వాళ్లతో కలిసిపోయేవారన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్యాకేజీ అని విమర్శించారు. హోదా రాకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని జగ్గిరెడ్డి ప్రశ్నలు సంధించారు.