‘‘పరకాల ప్రభాకర్... మీరు ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారా? లేక టీడీపీకి అధికార ప్రతినిధా? ఏ హోదాలో మీరు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు?’’..
పరకాల ప్రభాకర్‌పై తమ్మినేని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘‘పరకాల ప్రభాకర్... మీరు ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారా? లేక టీడీపీకి అధికార ప్రతినిధా? ఏ హోదాలో మీరు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు?’’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సామాజిక పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు పెద్ద సంఖ్యలో ఉన్నారని కావాలనే ప్రచారం చేస్తున్నారని గురువారం మీడియా భేటీలో ఆయన ఆక్షేపించారు. మగవాళ్లు కూడా వితంతువులుగా పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభాకర్ మాట్లాడారని, ఆయనకు దమ్ముంటే వారి జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పింఛన్లలో సగానికిపైగా కోత విధించాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయింపులను భారీగా తగ్గించారని, 43 లక్షలకు పైగా ఉన్న పింఛనుదారులకు 3,730 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్‌లో 1338 కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు. ప్రభాకర్ మనస్సాక్షికి ఈ విషయం తె లిసి కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి పింఛన్ విషయమై... ఎద్దు ఈనిందంటే, దూడను కట్టేయండి అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. మరోవైపు, అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సొంత బలంతో గెలుస్తాననే ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వైఎస్సార్‌సీపీ నేత బొడ్డేడ ప్రసాద్ సవాలు విసిరారు.