
ఐఎస్ లో చేరేందుకు వెళ్తూ అడ్డంగా బుక్కయ్యారు!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులోకి యువకులను రిక్రూట్ చేసుకుంటున్న 10 ఐఎస్ఎస్ సభ్యులను బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్రస్సెల్స్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులోకి యువకులను రిక్రూట్ చేసుకుంటున్న 10 ఐఎస్ఎస్ సభ్యులను బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసు విచారణలో భాగంగా తమకు లభ్యమైన వివరాల ఆధారంగా ఐఎస్ ముఠాను రాజధాని బ్రస్సెల్స్ నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఉగ్రదాడికి ఈ నిందుతులకు ఏ సంబంధాలు లేవని అధికారులు వెల్లడించారు. బ్రస్సెల్స్ లోని మొలెన్బీక్, కోయికెల్ బర్గ్, స్కాహెర్బీక్, ఎట్టర్బీక్ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
అదుపులోకి తీసుకున్న నిందితులు సిరియాలోని ఐఎస్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం ఫెడరల్ పోలీసులకు 10 మంది నిందితులను అప్పగించారు. వారిపై ఎలాంటి ఛార్జీ షీటు నమోదు చేయాలి అన్న విషయంపై బుధవారం ప్రాథమిక విచారణ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.