
అమెరికా నుంచి మళ్లీ తిప్పి పంపేశారు!
► 15 మంది విద్యార్థులు వెనక్కి..
► ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు
► తెలుగు విద్యార్థులు అనగానే వేధిస్తున్నారు
► ప్రభుత్వమే న్యాయం చేయాలి: విద్యార్థులు
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు నుంచి తెలుగు విద్యార్థులను అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెనక్కి పంపారు. అమెరికా నుంచి తిరుగుపయనమైన విద్యార్థుల్లో ఇప్పటికే 15 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఉన్నత చదువుల కోసం ఇటీవల 25 మంది తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లారు. అన్ని డాక్యుమెంట్లు సరిగానే ఉన్నా తమను వెనక్కి పంపివేయడంపై బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులను దర్యాప్తు చేసినట్లుగా విద్యార్థులను ప్రశ్నిస్తున్నారని వారు వాపోయారు. తెలుగు విద్యార్థులను చూడగానే ఏదో కారణంతో వేధిస్తున్నారనీ, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.