జకార్తా: ఇండోనేసియాలోని బాలి దీవికి ... పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ నీట మునిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. 25 మందికిపైగా జడ తెలియడం లేదు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎనిమిది మందిని రక్షించామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 49 మంది ఉన్నారని చెప్పారు. మోటర్ పడవ రెండుగా విడిపోయిందని అంతేకాకుండా పడవలోని వాటర్ పంప్ కూడా విరిగిపోయిందని తెలిపారు.
దీంతో పడవలోకి వేగంగా నీరు వచ్చి చేరిందన్నారు. పడవలో ప్రయాణిస్తున్నవారంతా ఇండోనేసియా వాసులేనని పేర్కొన్నారు. కాగా పడవలోని పెళ్లి బృందంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు లేరని వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశామన్నారు.