మోడల్‌ను కిడ్నాప్ చేసి..
మిలాన్: ఫొటో షూట్ కోసం వచ్చిన బ్రిటీష్ మోడల్‌ను కిడ్నాప్ చేసి ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టిన వ్యక్తిని ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాణిజ్య ప్రకటనలో నటించేందుకు 20 ఏళ్ల మోడల్ మిలాన్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. లుకాజ్ హెర్బా అనే వ్యక్తితో పాటు మరొకడు కలిసి ఆమెకు మత్తుమందు ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమెను నగ్నంగా ఫొటోలు తీశారు. తర్వాత ఆమె కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి సూట్‌కేసులో కుక్కేశారు. దీన్ని కారు డిక్కీలో వేసుకుని మిలాన్‌కు 120 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇంటికి తరలించారు.
ఆరు రోజుల పాటు ఆమెను అక్కడ బంధించారు. ఈలోగా బాధితురాలి ఫొటోలను లుకాజ్ సీక్రెట్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి ఆమెను వేలానికి పెట్టాడు. కనీస ధర 353,000 డాలర్లుగా బిట్‌కాయిన్ రూపంలో నిర్ణయించాడు. మరోవైపు వేలం ఆపాలంటే 300,000 డాలర్లు ఇవ్వాలని బాధితురాలిని పంపించిన మోడలింగ్ ఏజెన్సీని డిమాండ్ చేశాడు. అయితే బాధితురాలికి రెండేళ్ల బిడ్డ ఉందని తెలుసుకుని కిడ్నాపర్లు ఆమెను విడిచిపెట్టారు. తల్లులను కిడ్నాప్ చేయడం తమ నిబంధనలకు విరుద్ధరమని చెప్పి ఆమెను వదిలేశారు. తమ గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను పంపేశారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిలాన్ పోలీసులు లుకాజ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో చాలా మందిని అతడు కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. బాలికలను కిడ్నాప్ చేసి ఆన్‌లైన్‌లో విక్రయించే 'బ్లాక్ డెత్ గ్రూపు'లో అతడు సభ్యుడని భావిస్తున్నారు.