
బాంబు దాడుల్లో 36 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దద్ మంగళవారం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడుల్లో 36 మంది మృతి చెందగా మరో 100 మంది గాయపడ్డారు. మొదట షాబ్ జిల్లాలోని రద్దీగా ఉన్న ఓ మార్కెట్ వద్ద పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో క్షతగాత్రలకు సహాయం చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని మరోసారి దాడులకు పాల్పడటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. సహాయక సిబ్బందికి సమీపంలో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాగ్దాద్ ఆపరేషన్ కమాండ్(బీఓసీ) వెల్లడించింది.
ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఆత్మాహుతి దాడికి పాల్పడింది మహిళ కాదని ఐఎస్ తన ప్రకటనలో తెలిపింది. దక్షిణ ఇరాక్‌లో ఆదివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో దాదాపు 33 మంది దుర్మరణం చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.