ఉర్రూతలూగించే ‘ఏర్‌ గిటార్‌’ | Air Guitar World Championships 2019 | Sakshi
Sakshi News home page

ఉర్రూతలూగించే ‘ఏర్‌ గిటార్‌’

Published Tue, May 7 2019 6:58 PM | Last Updated on Tue, May 7 2019 7:19 PM

Air Guitar World Championships 2019 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏర్‌ గిటార్‌ కాంపిటేషన్‌’ పేరు వింటేనే అర్థం అవుతుంది గాలిలో గిటార్‌ వాయించడమని. బ్యాక్‌ గ్రౌండ్‌లో మెటాలిక్‌ గిటార్‌ సంగీతం హోరెత్తుతుంటే దానికి అనుగుణంగా ‘ఏర్‌ గిటార్‌ కాంపిటేటర్‌’ తానే నిజంగా గిటార్‌ వాయిస్తున్నట్లు గాలిలో చేతులు, వేళ్లూ కదుపుతూ, అనుగుణంగా అడుగులేస్తూ రెచ్చిపోవాలి. ప్రేక్షకులను ఉర్రూతలూగించాలి. అదెంత పని అని అనుకోవద్దు! గాలిలో గిటార్‌ వాయించడానికి కూడా ఎంతో అనుభవం కావాలి. అలాంటి వారి కోసం ప్రతియేటా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు కూడా జరుగుతున్నాయని తెలిస్తే కించిత్తైన ఆశ్చర్యం కలగకమానదు. ఫిన్‌లాండ్‌లోని ఒవులూ నగరంలో ప్రతిఏటా ఆగస్టు నెలలో ‘గాలిలో గిటారు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. వీటికి ప్రపంచంలోని 20 దేశాల నుంచి ఛాంపియన్లు హాజరవుతున్నారు.

వాటిలో భారత్‌ కూడా ఉండడం విశేషం. ముంబైలోని ‘ఏర్‌ గిటార్‌ ఇండియా’ సంస్థ ప్రతి ఏటా జాతీయ ఏర్‌ గిటార్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించి అందులో గిలిచిన వారిని ఫిన్‌లాండ్‌ పోటీలకు పంపిస్తోంది. వారి ఖర్చులను పూర్తిగా భరిస్తుంది. దేశంలోని పలు నగరాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణంగా జూన్, జూలై నెలల్లో నిర్వహిస్తుంది. తుది పోటీలు ముంబైలోనే జరుగుతాయి. ఫిన్‌లాండ్‌లో మొదటిసారి 1996లో ఏర్‌ గిటార్‌ పోటీలు నిర్వహించారు. అప్పుడు ‘ఒవులూ మ్యూజిక్‌ వీడియో ఫెస్టివల్‌’లో భాగంగా దీన్ని నిర్వహించారు. నాటి నిర్వాహకులు సరదాగా ఆ పోటీలను ‘ఏర్‌ గిటార్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’ అని అభివర్ణించారు. ఈ పోటీల గురించి విన్న అమెరికాలోని ఔత్సాహికులు 2003లో ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఫిన్‌లాండ్, అమెరికా బృందాల సంయుక్త కృషితో ఆ సంవత్సరం నుంచే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి.



ఈసారి జరగబోతున్నది 17వ ఛాంపియన్‌షిప్‌ పోటీలు. 2006లో అమెరికాలో విడుదలైన ‘ఏర్‌ గిటార్‌ నేషన్‌’ డాక్యుమెంటరీ, ‘టూ ఏర్‌ ఈజ్‌ హ్యూమన్‌’ అనే చిత్రం ద్వారా ఈ పోటీలకు ప్రాముఖ్యత పెరిగింది. ఏర్‌ గిటార్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం తపించిపోయే జర్నలిస్ట్‌ డాన్‌క్రేన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘టూ ఏర్‌ ఈజ్‌ హ్యూమన్‌’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కుర్రకారులో క్రేజీ పెరిగిపోవడంతో అమెరికాలో కూడా జాతీయ ఏర్‌ గిటార్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఆదరణ పెరిగింది.

ఫోనోగ్రామ్‌తోనే పుట్టుక
పాశ్చాత్య దేశాల్లో 1950లోనే ఈ కళ పుట్టగా 1980 ప్రాంతంలో బాగా రాణించింది. నాటి గ్రామ్‌ఫోన్, నేటి ఫోనోగ్రామ్‌ రాజ్యమేలుతున్న కాలంలో సంగీతానికి అనుగుణంగా పెదాలు ఆడించడం, చేతులు కలపడం, అడుగులు వేస్తూ చిందులు తొక్కడం నుంచి ఈ కళ పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. 1980 ప్రాంతంలో ప్రేక్షకులను మరింత అలరించడం కోసం పాశ్చాత్య సంగీత కచేరీల్లో కూడా ఈ కళను ప్రవేశపెట్టారు. ఓ పక్క కచేరీ కళాకారులు నిజమైన గిటార్‌ వాయిస్తూ, పాడుతూ ఉంటే పక్కనే ఉండే పెదవులు ఆడించే కళాకారులు, గాలి గిటారిస్టులు సంగీతానికి  అనుగుణంగా చిందులేస్తూ రెచ్చిపోయేవారు. గొంతుతో పాడేవారు, నిజమైన గిటారుతో వాయించేవారు అంతగా ఎగరలేరు, దూకలేరు కనుక వీరి అవసరం పడింది. ఒకసారి గాలిలో గిటారు వాయిస్తే, మరోసారి పియానో, వాయించడం, మరో సారి డ్రమ్స్‌ కొట్టినట్లు నటించడం, అన్నీ కలిపి ఒక్కరే నటించడం లాంటి ప్రయోగాలు కూడా వచ్చాయి.

నిజమైన కచేరీల్లోనూ నటన
1957లో అమెరికాలో జరిగిన స్టీవ్‌ అలెన్‌ షో, 1969లో వుడ్‌స్టాక్‌లో జో కాకర్‌ కచేరీలో వీరి ప్రదర్శన కనిపిస్తుంది. 20వ శతాబ్దంలో జిమ్మీ హెడ్రిక్స్, జిమ్మీ పేజ్, ఎడ్డీవాన్‌ హాలెన్, రిక్‌ నీల్సన్, లీటా ఫోర్డ్‌ లాంటి రాక్, పాప్‌ స్టార్లు ఈ గాలి గిటారిస్టులతో కలిసి కచేరీలు నిర్వహించారు. ‘సిండర్‌ఫెల్లా, బిల్‌ అండ్‌ టెడ్స్‌ ఎక్సలెంట్‌ అడ్వెంచర్, రిస్కీ బిజినెస్‌’ లాంటి హాలివుడ్‌ చిత్రాల్లో కామిక్‌ పాత్రల్లో గాలి గిటారిస్టులు కనిపిస్తారు. అమెరికాలోని జాన్‌ మ్యాకెన్నా, మైఖేల్‌ మోఫిట్‌ 1983లో రాసిన ‘ది కంప్లీట్‌ ఏర్‌ గిటార్‌ హ్యాండ్‌బుక్‌’లో కొంత చరిత్ర ఉంది. ఫిన్‌లాండ్‌లో 2018లో జరిగిన 16వ ప్రపంచషిప్‌ పోటీల్లో జార్జియా లంచ్‌ అనే అమెరికా ఏర్‌ గిటారిస్ట్‌ కిరీటాన్ని దక్కించుకుంది. ఈసారి ఆమెతో సహా పోటీదారులందరిని ఓడించిన వారే విజేత. జార్జియా లంచ్‌ లావు దక్కడం కోసం గాలి గిటార్‌ను ప్రాక్టీస్‌ చేసిందట. అయినా ఆమె లావు తగ్గలేదు. ఆమె పేరులోనే లంచ్‌ ఉంది మరి. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న వారు ప్రపంచ శాంతికి సందేశం ఇస్తూ తిరగాలట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement