ఇంగ్లీష్లో మాట్లాడని సామాన్యుడు.. | All you need to know about Maithripala Sirisena | Sakshi
Sakshi News home page

ఇంగ్లీష్లో మాట్లాడని సామాన్యుడు..

Published Sat, Jan 10 2015 12:49 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

ఇంగ్లీష్లో మాట్లాడని సామాన్యుడు.. - Sakshi

ఇంగ్లీష్లో మాట్లాడని సామాన్యుడు..

కొలంబో: రైతు నేస్తం.. గ్రామీణ శ్రీలంకకు ప్రతీక.. ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తులనే ధరించే జాతీయ వాది. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన  మైత్రిపాల సిరిసేన వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఈ పదాలు చాలు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో మైత్రిపాల సిరిసేన జన్మించారు.

20 ఏళ్ల వయసులోనే అంటే 1971లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలపై రెండేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టిన సిరిసేన అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పలు ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖ, రక్షణశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయనను హతమార్చేందుకు ఎల్టీటీఈ ఐదుసార్లు విఫలయత్నం చేసింది. 2008లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మహీంద రాజపక్సకు సిరిసేన మంత్రివర్గ సహచరుడు.

అయితే ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్స నుంచి విడిపోయిన సిరిసేన ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో సిరిసేనను రాజపక్సకు బలమైన ప్రత్యర్థిగా ఎవరూ భావించలేదు.

 

రైతు నేపథ్యం వల్ల  గ్రామీణ ప్రాంతాల్లో సిరిసేనకు లభించిన భారీ మద్దతు, పట్టణాల్లో ప్రధాన ప్రతిపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీకున్న పట్టు, రాజపక్సపై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబ పాలనపై వ్యతిరేకత ఇవన్నీ కలసివచ్చి ఎన్నికల్లో సిరిసేనను విజయ పథంలో నిలిపాయి. మరోవైపు, సిరిసేనకే మద్దతివ్వాలంటూ మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ కూడా తన మద్దతుదారులకు పిలుపునివ్వడం, అలాగే బౌద్ధుల్లో ప్రజాదరణ ఉన్న బుద్ధిస్ట్ నేషనలిస్ట్ హెరిటేజ్ పార్టీ కూడా మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement