ఈ మెట్లు ఎక్కగలవా...ఓ నరహరి!
బీజింగ్: సాహసం చేస్తే పోయేదేమీ లేదు ప్రాణాలు తప్పా! అన్నట్లుగా ఉంది ఆ దారి. దక్షిణ చైనా, గ్వాంగ్‌డాంగ్‌లోని గోల్డ్ మౌంటేన్ పర్వత శిఖరాగ్రంను చేరుకునేందుకు అత్యంత ప్రమాదకర మెట్లదారిని నిర్మించింది చైనా ప్రభుత్వం. సముద్ర మట్టానికి 4,650 అడుగుల ఎత్తులోవున్న పర్వత శిఖరాగ్రంను చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మెట్లదారిలో 1640 అడుగుల మేర మెట్లు మాత్రం అచ్చం నిచ్చెనలానే ఉంటాయి.
ముందు వెళుతున్న వ్యక్తి పట్టుతప్పి పడిపోతే...ఆ వెనకాలే మెట్లు ఎక్కుతున్నవారంతా పడిపోవడం ఖాయమని చెప్పొచ్చు. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ మెట్ల దారిని పర్యాటకుల కోసం సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభించారు. కొద్ది రోజులు మాత్రమే పర్యాటకుల కోసం తెరచి ఉంచుతామని, ప్రమాదాలను అంచనా వేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చైనా పర్యాటక శాఖ ప్రకటించింది.
దీనిపై చైనాలో ట్విట్టర్‌కు సమానమైన ‘వీబో’ సోషల్ వెబ్‌సైట్లో కామెంట్స్ విరివిగా వచ్చి పడుతున్నాయి. సాహసం సేయరా డింబకా! అంటూ ట్వీట్ల ద్వారా ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అది ఎంత సురక్షితమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర దారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
సాహసం చేస్తే రాజకుమారి దక్కుతుందో, లేదోగానీ జీవితానికి సరిపడా ఓ అత్యద్భుత అనుభూతి మాత్రం మిగులుతుంది. అందమైన పర్వతాలకు, లోయలకు, వాటర్ ఫాల్స్‌కు నెలవైన గోల్డ్ మౌంటేన్ ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.