చైనా మార్కెట్లు జూమ్.. ట్రంప్ ఎఫెక్ట్?
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ స్టన్నింగ్విక్టరీ చైనామార్కెట్లకు మాంచి బూస్ట్ ఇచ్చింది. గురువారం షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ గురువారం రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. చైనా మార్కెట్లు 1.4 శాతం లాభపడగా, చైనా స్టాక్స్ 10 నెలల గరిష్ఠానికి చేరాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.4 శాతం జంప్ చేసి 3,171 పాయింట్లకు చేరింది. ఈ ఏడాది జనవరి8 తరువాత ఇదే అత్యధికమని ఎనలిస్టుల అంచనా. బ్లూచిప్ షేర్ల ఇండెక్స్ సీఎస్‌ఐ ఇండెక్స్ కూడా1.1శాతం ఎగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఆర్థిక, పరిశ్రమ రంగ షేర్లతోపాటు చైనా ప్రాపర్టీ డీలర్ జెయింట్ వాంటే 7.5 శాతం ఎగిసింది. దీంతో మరో రియల్ ఎస్టేట్ బహుళజాతి సంస్థ ఎవర్ గ్రాండ్.. వాంటే లో మరో 8.3 వాటాను పెంచింది.
కాగా ఒకవైపు ట్రంప్ అనూహ్య విజయంతో ప్రపంచం షాక్ లో ఉండగా, ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా స్పందించాయి. మరోవైపు చైనా మార్కెట్లు కఠినమైన మూలధన నియంత్రణ కారణంగా సాధారణంగా అంతర్జాతీయ ట్రెండ్ కు పెద్దగా స్పందించవు. కానీ లోయర్ లెవల్స్‌లో మదుపర్ల కొనుగోళ్లు స్థిరపడుతున్న చైనా ఆర్థిక వ్యవస్థకు నిదర్శమని తెలుస్తోంది. కాగా దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా సుమారు 500 పాయింట్ల లాభానికి చేరువలో ఉన్నాయి. బుధవారం వెయ్యిపాయింట్లకు పైగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ధోరణి భారీగా నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ రంగాలు భారీగా లాభపడుతున్నాయి. అయితే నిన్న భారీగా దూసుకుపోయిన బంగారం నేడు స్థిరంగా ట్రేడవుతోంది.